Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


Controversies about Titles, Dialogues, Lyrics in Telugu Movies

మీ మనోభావాలు దెబ్బ తిన్నాయా? దెబ్బకు సెట్ అయ్యే ధర్మ మార్గం

"చూడు ..రైటరూ ...నీ కథ వింటానికి అంతా బాగానే ఉంది, బోల్డు కమమర్షియల్ ఎలిమెంట్స్ కూడా గుప్పించావు ఓకే, గ్లామర్ హీరోయిన్స్ చూసుకుంటారు...డబుల్ ఓకే ... కానీ...అసలైంది మిస్ చేసేసావయ్యా.... మినిమం ఓ రెండు కాంట్రవర్శి ఎలిమెంట్స్ అయినా కథలో లేకపోతే ఏం పే చేస్తుంది...ఇంత తెలివైన వాడివి ..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సైపోయావు... అసలు వివాదం లేకపోతే వీధిలో జనాలకి మన సినిమా ఒకటుందని, అది త్వరలో రిలీజ్ కాబోతోందని ఎలా తెలుస్తుంది. మనమేమన్నా బాహుబలి తీస్తున్నామా...మీడియా మొత్తం అదే పనిమీద రోజుకో న్యూస్, గంటకో బ్రేకింగ్ న్యూస్, వారానికో స్పెషల్ ఆర్టికల్ వేయటానికి.

చక్కగా రూపాయి ఖర్చు లేకుండా...ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెట్టే సీన్స్ సినిమాలో లేకపోతే నేను తియ్యనయ్యా...అయినా మన డైరక్టర్ ఏమన్నా ఆర్జీవీనా...సినిమా ఎలా ఉన్నా...తన ఇంటర్వూలతోనూ, ట్వీట్స్, పోస్ట్ లతోనూ వివాదం రేపి, సినిమాపై అటెన్షన్ తేవటానికి...కాస్త అప్పుడప్పుడూ బుర్రని తీసి వాడుతుండడయ్యా...

ఆ..ఏంటి .. వివాదం సీన్స్ కథలో ఇమడవు అంటావా...పోనీ డైలాగుల్లోనో, పాటల్లోనే ఏదో కులాన్ని కెలకవయ్యా...వాళ్లే ఆ డైలాగునో, పాటని తీసేయమని గొడవ చేస్తారు..గొడవ పెద్దదయ్యేదాకా ఆగు...ఛానెల్స్ మొత్తం మన సినిమా మీద చర్చా వేదిక పెట్టి ఇరవైనాలుగు గంటలూ పండగ చేస్తారు...అప్పుడు జనాలకి మన సినిమా ఒకటుందనే విషయం రిజస్టర్ అయ్యిపోద్ది...ఇలాంటి గొడవలు పడ్డ సినిమా కు బిజినెస్ కూడా బాగా జరుగుద్ది..సినిమా ఫీల్డ్ పుట్టినప్పుడు పుట్టారు...ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారయ్యా.." ఓ నిర్మాత ...ఓ కొత్త రైటర్ కథ చెప్పటానికి వెళ్లినప్పుడు పీకిన క్లాస్. ఈ సంఘటన జరిగి నాలుగైదేళ్లు అవుతోంది.

అలాగని అందరు నిర్మాతలూ ఇలా అడుగుతారని కాదు..కావాలని తమ సినిమాలో కంట్రవర్శి సన్నివేశాలు పెడతారని అంతకన్నా కాదు. ఎందుకంటే పెద్ద హీరోలు, బ్యానర్స్ సినిమాలకు ఎలాగో పబ్లిసిటీ బాగుంటుంది. వాళ్లు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఉండదు. చీప్ టేస్ట్ ఉండి...సినిమాని కేవలం అడ్డుగోలుగా సంపాదించటానికి మార్గంగా ఎంచుకున్న మహానుభావులకే ఇలాంటి ఐడియాలు వస్తూంటాయి. వాళ్లే కావాలని టైటిల్ లోనో, డైలాగులోనో ఇంకోచోటే ఏదన్నా వివాదం జరిగితే బాగుండుని అని కక్కుర్తి పడుతూంటారు. ఆ మధ్యన ఓ సినిమా ట్రైలర్ తోనే బిజినెస్ చేసేద్దామని శివలింగం మీద...బీరు పోసి, మాంసం ప్రసాదం గా పెట్టినట్లు చూపి రచ్చ రచ్చ చేసారు. అఫ్ కోర్స్ ఆ సినిమాకు మీడియాలో పబ్లిసిటీ ఓ నాలుగు రోజులు ఫ్రీ గా జరిగిందనుకోండి. అయితే ఆ సినిమాకు దానివల్ల ఒరిగిందేమిటనేది తెలియదు.

ఏదో అలా ఊరు పేరు లేని ఓ నిర్మాత, దర్శకుడు తమ సినిమా వ్యాపారం జరగటానికో, లేక నలుగురు దృష్టిలో పడటానికో ...ఏదో ఒక మతాన్ని (ఎక్కువసార్లు హిందూ మతాన్నే) విమర్శించటం చేసాడంటే పాపం అని వాళ్ల మానసిక స్దాయి మీద జాలి పడచ్చు. కానీ పెద్ద హీరోలు లేదా బ్యానర్స్ సినిమాలు కూడా కోరి వివాదం తెచ్చి పెట్టుకుంటున్నట్లుగా ఓ కులాన్ని లేదా మతాన్ని టార్గెట్ చేయటం ఎందుకనేది అర్దం కాదు. అదేంటో కానీ హిందువులు నిర్మించి, డైరక్ట్ చేసే సినమాల్లోనే....హిందూ దేవతలను బఫూన్లుగా, వెర్రి వెంగళాయిలుగా, స్ర్తి లోలురుగా తెరపై చిత్రీకరిస్తూ వుండటం ఆశ్చర్యమనిపిస్తుంది. తమకు తమ మతంపై గౌరవం లేదా నమ్మకం లేకపోవచ్చు. కానీ మరెవరకీ ఉండకూడదు అనటం ఆశ్చర్యం అనిపిస్తుంది. పైగా మేము అదే మతస్దులం లేదా అదే కులస్దులం,మేము ఎందుకు అలా చేస్తాం...అందులో ఉన్న అనంత అర్దాన్ని మీరు అల్ప బుద్దితో అర్దం చేసుకోవటం లేదు... అని కవరేజ్ చేసుకోవటానికి ప్రయత్నించటం కూడా హర్షించబుద్దేయదు.

అలాగే అదే సమయంలో .... సినిమా అనేది కళ... కళను కళగా చూడాలి తప్ప, అనవసరపు రాద్ధాంతాలు చేయకూడదు. ఇదీ ఇటీవల సినిమాల్లో వివాదాలు జరుగుతున్నప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వినపడుతున్న మాటలు. అయితే ఇదే సమయంలో నిజంగానే మనం తీసే లేదా చూసే సినిమాలు కళగా భావించే రూపిందిస్తున్నారా...వ్యాపారం కోసం కాదా...సమాజంలో సమూలమైన మార్పు కోసం వీటిని తీస్తున్నారా...అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. సినిమా పక్కా వ్యాపారమైనపోయినప్పుడు...కళ కోసం అనే మాటలు మాట్లాడుతూంటే వింతగా అనిపిస్తుంది. ఇది కేవలం తెలుగు సమస్యే కాదు. ఇప్పుడు భాష కు అతీతంగా ప్రతీభాషలోనూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.

అదే మన భారతీయ సినిమా... పరిమితులు అర్థం చేసుకుని, ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలను, మత స్వేచ్ఛను, మంచిని, మానవత్వాన్ని గౌరవిస్తూ ఇక్కడ సినిమాలు తీస్తే ఏ సమస్యా రాదు. తల్లి,తండ్రులు, మనకు చదువు చెప్పే గురువు మీద కూడా సెటైర్స్ వేస్తూ వాళ్లని చిన్నబుచ్చుతూ సినిమాలు తీస్తున్నారు. మనకు భావ ప్రకటనా స్వేచ్ఛ వుంది...అది కాదనలేని సత్యం.. కానీ అదే సమయంలో నిషేధ సాహిత్యం అనేదీ కూడా వుంది.

బాహుబలి వంటి సినిమాలతో ...మన దక్షిణాది భాషల సినిమా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మార్కెట్ అవుతున్న డిమాండ్ వున్న సరుకుగా మారింది. అదే అదే సమయంలో వివాదాలకు కేంద్రమవుతోంది. సినిమాలపై నిషేధం విధించాలనే దగ్గర నుంచి,టైటిల్స్ మార్చాలి, సీన్లు కట్ చేయాలనేంత గొడవలకు కారణమవుతోంది. మనోభావాలు దెబ్బతీశారంటూ చాలా వివాదాలు ఎదుర్కొంటోంది.

ఇప్పటిది కాదు ఈ సమస్య...

అంతెందుకు...బాగా వెనక్కి వెళితే... తెలుగు సినిమా తొలినాళ్లలో ‘గొల్లభామ’ సినిమా పేరు విషయంలో కూడా ఇటువంటి వివాదమే చెలరేగింది. ఆఖరికి రెండో ‘గొల్లభామ’ సినిమా పేరును ‘భామా విజయం’గా మార్చారు.

మాలపిల్లది మరో గొడవ

ఇక మాలపిల్ల సంగతి చెప్పక్కర్లేదు.. ఈ సినిమా అత్యంత వివాదాస్పదమైన, వాదవివాదాలకు కారణమైన సినిమా. కుల మౌఢ్యం అన్ని కులాల వారిలోనూ ఉండగా కేవలం బ్రాహ్మణుల మీదనే కేంద్రీకరించి తీశారన్న విమర్శతో బ్రాహ్మణులు వ్యతిరేకించారు. బ్రాహ్మణులకు, హరిజనులకు మధ్య వైషమ్యాలు రేకెత్తించేందుకు, బ్రాహ్మణుల పట్ల ద్వేషం రగిలించేందుకు సినిమా తీశారంటూ అభ్యంతరకరమైన సన్నివేశాలను, సంభాషణలను తొలగించి పునర్నిర్మించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

బ్రాహ్మణులకు సినిమాపై ఉన్న ఆగ్రహాన్ని పెంచుతూ సినిమా యూనిట్ వారు "పిలక బ్రాహ్మణులకు ఫ్రీ పాసులు" అంటూ కరపత్రాలు ప్రచురించారు. ఇలా జరిగిన వాదోపవాదాలు, వివాదాలు అన్నీ చివరకు చిత్రంపై ఆసక్తి పెంచేందుకే పనికి వచ్చి ఘన విజయం సాధించింది. సినిమాలు వివాదం కావడంతో ప్రచారం ఎక్కువగా జరిగిపోతుంది. దీంతో ఇందులో ఏముందో నని సినిమాను చూడడం కోసం ఆసక్తి చూపుతున్నారు. ఇలా వివాదాలకు తావిస్తున్నటువంటి సినిమాలు వారికే కలిసి వస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో వివాదాలు

ఆ మధ్య ‘దేనికైనారెడీ’ సినిమాకు చెలరేగిన వివాదం సంగతి తెలిసిందే. ఒక సామాజికవర్గం తమను, తమ ఆచార వ్యవహారాలను కించపర్చిన రీతికి రోడ్డెక్కి, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులిచ్చి, కోర్టులను ఆశ్రయించే వరకు పోరాటం సాగింది.

పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ పేరు విషయంలో చెలరేగిన వివాదం ఆఖరికి కొమరం అన్న పదం తొలగించే వరకు సాగింది.

అలాగే ‘కెమేరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం తెలంగాణా ప్రాంతంలో ఆడకుండా అడ్డుకున్న రేంజ్‌లో వివాదం చెలరేగింది. తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నైజాంలో ఈ చిత్ర పంపిణీదారు దిల్‌రాజుల కార్యాలయాలపై దాడులు సైతం జరిగాయి. దాంతో ప్రభుత్వం కలగచేసుకుని కమిటీ వేసింది. కమిటీ వారు తెలియచేసిన కట్స్ ని దర్శక,నిర్మాతలు ఓకే చేయటంతో ఈ వివాదం వెంటనే సర్ధుమణిగింది.

‘దేవరాయ’ సినిమాకు టైటిల్ వివాదం చెలరేగి సద్దుమణిగింది.

‘వుమెన్ ఇన్ బ్రాహ్మనిజం’..విషయానికి వస్తే... చలం రచన ఆధారంగా రూపొందింది అని చెప్తున్న ఈ చిత్రాన్ని నిషేధించాలని బ్రాహ్మణ వర్గాలు, మహిళా సంఘాలు పోరాడాయి. దాంతో ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ.. చిత్రాన్ని వీక్షించింది. అందులో అసభ్యకరంగా ఉన్న దృశ్యాలపై తీవ్రంగా స్పందించింది. అశ్లీలత, అసభ్యత, శృంగారమే లక్ష్యంగా, ఒక కులాన్ని కించపరిచే సన్నివేశాలతో నిర్మించిన 'వుమెన్‌ ఇన్‌ బ్రామ్మనిజం' చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని నీలం సహాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ చిత్రం ప్రజాప్రదర్శనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. సెన్సారు ఇంకా చూడకుండానే, కొన్ని ట్రయిలర్లు నెట్‌లో పెట్టి, హడావుడి చేసి దేశవ్యాప్త నిరసన వ్యక్తం కావడంతో, దానిపై నిషేధం విధించక తప్పలేదు.

అక్కినేని కుటుంబ కధా చిత్రం మనం సినిమా ఓ మతం ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని అంటూ ఆ మతానికి చెందిన కొందరు మీడియాకి ఎక్కారు. ఈ సినిమాలో కాలేజీ ప్రిన్సిపాల్ గా కనిపించిన ఎమ్మెస్ నారాయణ వేసిన డైలాగులు కొన్ని క్రిష్టియన్ సంఘాలు ఆగ్రహానికి కారణం అయ్యాయి. క్రిష్టియన్ ఫాదర్ గెటప్ లో ఎమ్మెస్ నారాయణ చేసిన వెకిలి చేష్టలు క్రిష్టియన్స్ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని క్రిష్టియన్ సంఘాల వాదన.

ఆది హీరోగా తెరకెక్కిన చిత్రం”చుట్టాలబ్బాయి” లో ఇగో రెడ్డి పాత్ర. ఈ పాత్రను పృద్వీ తో వేయించాడు దర్శకుడు వీరభద్రం చౌదరి. దీనికి ఈగో ‘రెడ్డి’ అనే పారు పెట్టాడు. ఇందులో ఓ డైలాగ్ వుంది ‘ఈగో రెడ్డి అంటే గోనగన్నారెడ్డిలా ఉంటాడనుకున్నా… గోనెసంచిలమ్ముకునేవాడిలా ఉన్నాడేంట్రా’అని. ఇది తమ సామాజిక వర్గానికి కించపరిచేలా వుందని, దర్శకుడు వీర భద్రం చౌదరి కావాలనే ఇలా టార్గెట్ చేశాదాని ఆరోపించి ఈ సీన్ తొలగించాలని కోరారు.

ఇంక ‘నాన్నకు ప్రేమతో’ సినిమా రిలీజ్ కు ముందు వివాదంలో చిక్కుకొంది. ఆ సినిమా కోసం విడుదల చేసిన ఒక పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని దానిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ లుగా నటిస్తున్న జూ.ఎన్టీఆర్,రాకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ చేస్తున్న ఒక సన్నివేశంలో బ్యాక్ గ్రౌండ్ లో ఒక గోడ మీద ఇస్లాం మతానికి సంబందించి ఉర్దూలో వ్రాయబడిన సందేశాలు గల రెండు పోస్టర్లు కనిపిస్తున్నాయి. వాటి ముందు నిలబడి హీరో, హీరోయిన్లు డ్యాన్స్ చేయడాన్ని వారు తప్పు పట్టారు. తక్షణమే ఆ పోస్టర్లని, సినిమాలో ఆ సన్నివేశాన్ని తొలగించాలని వారు డిమాండ్ చేసారు.

విజయ్‌ హీరోగా వచ్చిన 'తుపాకీ' సినిమాపై అప్పట్లో ముస్లిం సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. ఇందులో తమ వారిని తీవ్రవాదులతో పోలుస్తూ కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సదరు వర్గ ప్రతినిధులు ఆరోపించాయి.

బాహుబలి-2 చిత్రంలో తమ కులాన్ని కించపరిచేలా కొన్ని సీన్లు ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని ఆరెకటికల సంఘం నేతలు డిమాండ్‌ చేసారు. ఈ సినిమాలో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదాన్ని వాడారని, అది ఆరెకటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆ సమితి ఆరోపించింది. అభ్యంతరం చెప్పాల్సిన సెన్సార్‌ బోర్డు సైతం ఆ పదానికి అనుమతినివ్వడం దారుణమని మండిపడింది.

ఇక నాగార్జునతో డైరెక్టర్ రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘ఓం నమో వేంకటేశాయ’ వివాదం విషయానికి వస్తే... గిరిజన జాతికి చెందిన హాథీరామ్ బాబా కథను తెరకెక్కించిన రాఘవేంద్రరావు, సినిమా పేరును ఓం నమో వేంకటేశాయ అని పెట్టడం అత్యంత దారుణమని, దర్శకుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు దిష్టిబొమ్మను వారు దగ్ధం చేశారు.

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘కాటమరాయుడు’ సినిమాలోని కొన్ని వ్యాఖ్యలు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, వికలాంగులను కించపరిచేలా ఉన్న వాటిని వెంటనే తొలగించాలని కోరుతూ… దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు ...రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజను కలిసి వినతిపత్రం సమర్పించారు. వెంటనే ‘కాటమరాయుడు’ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేసారు.

'మగధీర' రిలీజైనపుడు ఆ సినిమాలో ఒకచోట లాయర్‌ను క్రూరంగా చంపే సీన్ ఉందని.. తమ మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ లాయర్లు ఆందోళన చేపట్టడం గుర్తుండే ఉంటుంది.

ఇక తాజాగా హీరో అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలోని పాటపై వివాదం చెలరేగింది. ఈ సినిమాలో ‘గుడిలో..బడిలో’ అనే సాంగ్‌పై బ్రాహ్మణ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. శివభక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉదంటూ మంత్రి తలసానికి ఫిర్యాదు చేశారు. ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని, అదే రోజు ఆలిండియా బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఇంతకీ మీకు గుర్తుందో లేదో కానీ..'బిజినెస్ మేన్' సినిమాలోని 'వి లవ్ బ్యాడ్ బాయ్స్' అనే పాట హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని వివాదం చెలరేగినప్పుడు దర్శకుడు పూరి...'మనో భావాలు దెబ్బతింటున్నాయని' కనిపిపెట్టిన వాడి పీక పిసకాలి అంటూ చాలా కోప్పడ్డారు. పని పాట లేని వాళ్లే మనోభావాల గురించి పట్టించుకుంటారని, సక్సెస్ ఫుల్ పీపుల్ ఇలాంటివి పట్టించుకోరని, దేవుడంటే నాకు సెంటిమెంటు లేదని, ఇండియాలో మనో భావాలు దెబ్బతిన్నట్లుగా ఏ కంట్రీలోనూ దెబ్బతినడం లేదని.... పూరి వ్యాఖ్యలు చేశారు.

మన సినిమా కథలు, పాటలు,యాక్షన్ ఎపిసోడ్స్, సీన్స్ , ఆఖరికి డైలాగులు సైతం వేరే ఇతర కంట్రోల వాళ్లని కాపీ కొట్టి అనుసరిస్తాం. అలాంటిది ఈ విషయంలో మిమహాయింపు ఎందుకనేది ఆయన ఆవేదన కావచ్చు. కాబట్టి మనోభావాలు విషయంలో కూడా వేరే కంట్రీల వారిని అనుసరించాలని కోరుకోవటంలో తప్పేమి లేదనిపిస్తుంది.

ఫైనల్ మాట...

అప్పట్లో సినిమాలు చూసి ఉద్యమిస్తే..ఇప్పుడు ప్రజలే..సినిమాలపై ఉద్యమించే స్దాయికి ఎదిగారు అన్నది మాత్రం నిజం...పబ్లిసిటీ కోసమో లేక అలవాటులో పొరపాటుగానో...ఓ కులాన్నో , మతాన్నో టార్గెట్ చేస్తే...మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ మీడియాకు ఎక్కి అపహాస్యం పాలవకుండా..చక్కగా ఆ మతం లేదా ఆ కులం వాళ్లంతా ఆ సినిమాని పూర్తి స్దాయిలో బహిష్కరిస్తే సరిపోతుంది కదా... ఎక్కువ మంది చూడటం మానేస్తే సినిమావాళ్లే దార్లో కు వస్తారు. అలాగే వాళ్లుకు ఫ్రీ పబ్లిసిటీ కూడా మీరు చేయవల్సిన పనిలేదు.

అబ్బబ్బే...అలా చేయలేము అంటారా...మీ మనోభావాలు ...మడిచి చంకలో పెట్టుకుని చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి...అంతేకాని మనోభావాలు అనే పదాన్ని అపహాస్యం చేసే స్దాయిలో మీడియాలో స్టేట్ మెంట్స్ ఇచ్చి మీ పరువు మీరే తీసుకునే స్కీమ్ పెట్టుకోకండి.. ఇది వేరే కులపోళ్లు , లేదా మతం వాళ్లు చూసి నవ్వుకునేందుకు మీకై మీరు చేసుకునే కుట్ర..అని గుర్తుంచుకోండి.. మీ బాధ ఖచ్చితంగా వేరే వాళ్లకి కామెడీనే...ఆ విషయం గమనిచండి.

-Ragalahari Team