Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


Advantages of Movie Tickets Price Hike!

సినిమా టిక్కెట్ల రేటు పెంపు...మీరు ఊహించని బోలెడు లాభాలు

చిన్న సినిమాని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని,దాంతో బుల్లి నిర్మాతలు నష్టాలు బారిన పడిపోతున్నారని, పదే పదే ఆడిపోసుకోవటం జనాలకు అలవాటై పోయింది. అందుకేనేమో...ప్రభుత్వ యంత్రాంగం కమిటీలు వేసి మరీ ఓ నిర్ణయం తీసేసుకుంది. సమస్యని మెదల్లోనే నరికేసే ...ఓ నిర్ణయం తీసుకుంది. దాన్ని కనుక ఖచ్చితంగా అమలు చేస్తే ...ఇంక వారికి ఆ సమస్యలు ఉండకపోవచ్చు. ఎందుకంటే చిన్న నిర్మాత అనేవారే మిగలరు కాబట్టి. ఇంతలా చిన్న సినిమాని సమూలంగా మార్చేసే... ఆ అద్బుతమైన నిర్ణయం ఏమిటీ అంటే.. టిక్కెట్ రేట్లు పెంపు.

ఎన్నో ప్రయోజనాలు...

టికెట్ రేట్లు పెంచారని ఓ బాధపడే పోయే బదులు అందులో ఉన్న ఉపయోగాలు మనం ఓ సారి క్రాస్ చెక్ చేసుకుని సంతోషపడాలి. ఒక్కసారి ఆలోచించండి...పెరిగిన ఈ పెద్ద రేటు పెట్టి భారీ సినిమాలు చూస్తాం కానీ..చిన్న సినిమాని ఏం చూస్తాం. బాహుబలి, డీజే వంటి పెద్ద సినిమాలకే ఓటేస్తారు.

దాంతో చిన్న సినిమా ఆడే థియోటర్ కు ఎవరూ రాకపోతే ...కొన్నాళ్ళకు వాళ్లకే విసుగొచ్చి సినిమాలు తీయటం మానేస్తారు .. ఆ విధంగా చిన్న సినిమా నిర్మాతలు ఇటు సినిమాల వైపు రాకుండా..చక్కగా వేరే వ్యాపారులు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది..సినిమా వ్యాపారంలో వాళ్లకు ఇక నష్టాలు వచ్చే సమస్య లేదు. దాంతో మనకు ప్రభుత్వం చిన్న సినిమా పరిరక్ష ఉద్యమం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

నిరుద్యోగులకు వరం

అలాగే...పైరసీ ని ఇక నిరుద్యోగులు వృత్తిగా చేపట్టే అవకాసాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెరిగిన టిక్కెట్ చార్జీలతో పైరసీ చూసే వారు ఖచ్చితంగా పెరుగుతారు. పెరిగిన వాళ్లందరకూ పైరసీ సినిమాలు అందించాలంటే పెద్ద నెట్ వర్క్ కావాలి. అందుకు తగ్గ జనం కావాలి. అప్పుడు ఖచ్చితంగా జనాలకి చాలా మందికి పని దొరుకుతుంది.

టీఆర్పీలు పెరుగుతాయి

టిక్కెట్ రేటు పెంపు వల్ల టీవిలలో పోగ్రామ్ లకు టీఆర్పీలు పెరుగుతాయి. ఇన్నాళ్లూ ఆడవాళ్లకే పరిమితమైన టీవి ఛానెల్స్ మగవాళ్ళకు కూడా పోగ్రామ్ లు డిజైన్ చేస్తాయి. ఎందుకంటే అంతంత రేటు పెట్టి ధియోటర్ కు వెళ్లి సినిమా చూడటం కన్నా...హ్యాపీగా టీవి లో ఏదో ఒక సినిమానో , పోగ్రామో చూద్దామని ఫిక్స్ అవుతారు.ముఖ్యంగా చాలా సినిమాలు టీవీల్లో వచ్చినప్పుడు చూద్దాంలే అని పోస్టర్ చూసి ఫిక్స్ అవుతారు. ఇళ్లల్లో పెద్ద సైజ్ టీవీలు కొనుక్కుంటారు. అప్పుడు మిడిల్ క్లాస్ ఇళ్లల్లో కూడా..సీరియల్స్ చూసే భార్యకో టీవి, మగవాళ్లకో టీవి కావాలి. దాంతో టీవిలు అమ్మకాలు పెరుగుతాయి.

స్టార్స్ సినిమాలూ పెరుగుతాయి...

ఇక పెద్ద నిర్మాతలకు ఈ టిక్కెట్ పెంపు నిర్ణయం ఓ వరం. ఎందుకంటే చిన్న సినిమా అనేది ఉండదు. మాకు ధియోటర్ ఇవ్వలేదు. ఆ నలుగురు అంటూ టీవిల్లో నినాదాలు చేసేవారు ఉండరు. చిన్న సినిమా అనేది లేకపోతే...ఖాళీగా ఉన్న ధియోటర్స్ ని నింపటానికి సినిమాలు కావాలి. అప్పుడు మరిన్ని పెద్ద సినిమాలు కావాలి. పెద్ద సినిమాలు చూసే జనం పెరుగుతారు కాబట్టి...హ్యాపీగా పెద్ద నిర్మాతలు మరింతగా సినిమాలు చేయవచ్చు. ఆ డిమాండ్ ని తట్టుకోవటం కోసం...స్టార్స్ కూడా యేడాదికి మరో నాలుగు సినిమాలు చేయవచ్చు. ఇది ఆ స్టార్స్ ఫ్యాన్స్ కు ఆనందమే.

ఇలా టిక్కెట్ ధరలు పెంచటం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి...మనం జాగ్రత్తగా దృష్టి పెట్టి చూస్తే...కాబట్టి చిన్న సినిమా నిర్మాతలు, దర్శకులు, పైరసీ బ్యాచ్ వాళ్లు టిక్కెట్ పెంపు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి సన్మానం చేయాలి..జేజేలు కొట్టాలి...కాదంటారా..

ఇంతకీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి...

చిన్న థియేటర్‌ మొదలు.. మల్టీప్లెక్స్‌ వరకూ టిక్కెట్ల ధరలు పెంచుకోవాటనికి అనుమతి ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్‌ యాజమాన్యాలకు అనుమతి ఇస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏ స్దాయిలో మార్పు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిథిలోని ఏసీ థియేటర్లలో: బాల్కనీ - రూ.120, లోయర్‌ క్లాస్‌ - రూ.40

గ్రేటర్‌లోని నాన్‌ ఏసీ థియేటర్లలో: బాల్కనీ - రూ.60, లోయర్‌ - రూ.20

మున్సిపాలిటీల పరిథిలోని ఏసీ థియేటర్లలో: బాల్కనీ - రూ.80, లోయర్‌- రూ.30

మున్సిపాలిటీల్లోని నాన్‌ ఏసీ థియేటర్లలో: బాల్కనీ - రూ 60, లోయర్‌- రూ.20

నగర పంచాయితీ, గ్రామపంచాయితీ పరిథిలోని ఏసీ థియేటర్లలో: బాల్కనీ - రూ.70, లోయర్‌ - రూ.20

నాన్ ఏసీ థియేటర్లలో హైయర్ క్లాస్ ధర రూ. 50, లోయర్ క్లాస్ టికెట్ ధర రూ. 15

సినిమాహాల్స్ ఆధునీకరణ కోసం రూ. 2 నుంచి రూ. 7, నాన్ ఏసీ థియేటర్లలో రూ. 2 నుంచి రూ. 5 పెంచుకునే వెసులుబాటు కల్పించారు.

మల్టీప్లెక్స్‌ల్లో గోల్డ్, రాయల్ టికెట్ల ధరలు రూ. 300 మించకూడదని వెల్లడి చేశారు.

ఎగ్జిక్యూటివ్ టికెట్ల ధరలు రూ. 200 మించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇన్నాళ్లూ చౌకగా సామాన్యుడు దొరుకుతున్న వినోదం ఏమిటీ అంటే...సినిమానే. ఇప్పుడది కూడా ప్రభుత్వ నిర్ణయం పుణ్యమా అని ప్రియం అయ్యిపోయింది. ఇలా భారీగా టిక్కెట్‌ ధర పెరగడం వల్ల ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఒకసారి మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్లాలంటే రూ.1,000 పైగా ఖర్చువుతుంది. నెలకు రెండు మూడు సార్లు సినిమాకు వెళ్లాలనుకుంటే... ఆ ఖర్చుని భర్తీ చేయటం కోసం పార్ట్ టైమ్ జాబ్ లు వెతుక్కోవాలి.