Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


Savitri Interview

ఆ రోజుల్లో ...మహానటి సావిత్రి ఎంత సరదాగా,తెలివిగా మాట్లాడేదో చదవండి

(1954 జూలై “కినిమా” పత్రికలో కొమ్మారెడ్డి సావిత్రి పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ప్రచురింపబడింది)

కొందరు ప్రముఖ హిందీ తారలు ప్రకటించుకున్నట్లు మీకు కాబోయే భర్త ఎలాంటివాడుగా వుండాలో చెప్తారా?
నేనింతవరకూ ఊహించుకోలేదే

దయచేసి మీరు త్వరగా ఒక ప్రొడ్యూసర్ అయి, మాలాంటి ఉత్సాహవంతులైన కళాభిమానులకు సినిమా రంగంలో తగిన ప్రోత్సాహం కలిగిస్తారనాశించవచ్చునా ?
ప్రొడ్యూసర్ కాదలచుకోలేదు

ఇంతవరకు మీరు నటించిన చిత్రాలలో ఏ పాత్రకైనా న్యాయము చేకూర్చానని చెప్పగలరా?
చెప్పగలను.

నేను మీకొక రిస్టువాచ్ బహుమతి ఇవ్వాలనుకొనుచున్నాను. అది మీకు చేరేవిధం ఏలాగ ?
పోస్టు విధంగా.

జనతావారి “పరివర్తన” కథ, ఆత్రేయ — పరివర్తన నాటకం ఒకటేనా?
కాదు, దానికీ, దీనికి చాలా తేడా వుంటుంది.

“పరివర్తన” లో హీరో ఎన్.టి రామారావా లేక నాగేశ్వరరావా?
రామారావు

మీరు సినిమా రంగం చేరింది కేవలం ధనాపేక్ష కోసమా లేక కళోపాసనకా?
రెండింటి కోసం

“పెంపుడు కొడుకు” డైరెక్టరు అయన ప్రసాద్ గారిదని నేను , కాదని నా మిత్రుడు వాదించుకుంటున్నాము. మీరు ఎవరితో ఏకీభవిస్తారు?
“పెంపుడు కొడుకు” చిత్రం ప్రసాద్ గారిది కాదు ఆయన ఆ చిత్రానికి దర్శకుడు మాత్రమే.

కె.వి చౌదరికిని , కె. వి రెడ్డికిని ఏమైనా సంబంధము ఉందా?
సినిమాల వరకు వారు స్నేహితులు.

మీరు ఏ సినిమాలోనైనా స్వంతముగా పాటలు పాడారా?
లేదు.

బ్రతుకు తెరువు లో మీకు ఉన్న తలవెంట్రుకలు మీ తలవేనా లేక కంపెనీ తలా?
ఇంకా నయం మీ ముఖమేనా, లేక కంపేనీ ముఖమా అని అడిగారు కాదు.

నేను కినిమా కు 15 నెలలనుండి ప్రశ్నలు పంపుతున్నాను. కాని, నన్ను నిరుత్సాహపరచి ఎవ్వరూ కూడా సమాధానాలివ్వడం లేదు. దయయుంచి దీనికైనా సమాధానాలిస్తారా?
15 నెలలనుండి కినిమాకు పంపిన ప్రశ్నలు ఇలాంటివేనా సోదరా?

నన్ను మరచిపోయావా సిస్టర్?
మరచిపోలేదు బ్రదర్.

మీ అక్క మారుతి , మీ నాన్నగరి మొదటి భార్య కుమారై అని నేను , కాదని నామనస్సు వాదించుకుంటున్నాము. ఏది నిజము?
మీ మనస్సు చెప్పేదే నిజం.

సోదరీ నీ యొక్క వివాహమునకు నేను రావచ్చునా?
తప్పకుండా….

నాకు కబురు పంపెదవా?
జ్ఞాపకముంటే…

మీరేదో హిందీ చిత్రాలలో నటిస్తున్నారని విన్నాను. నిజమేనా సోదరీ?
నిజమే.

నిజమే అయితే మీకు హిందీవచ్చా?
ఓ.

పార్వతి పాత్రవల్ల మీరు తెలుసుకున్న విషయాలేమైనా ఉన్నవా?
అటువంటి పాత్రలు నటించటమంటే పెద్ద పరీక్షలకు కూర్చున్నంత పని ఔతుందని…

“దేవదాసు” లో పార్వతి చనిపోయిందీ లేనదీ కచ్చితంగా తెలుపలేదు. అసలింతకూ పార్వతి చనిపోయిందా లేదా?
“దేవదాసు” చనిపోయిన తరువాత పార్వతి వున్నా ఒకటే లేకపోయినా ఒకటే.

నటీనుటులకు దర్శకుడు ముందుగా కథంతా, చెప్తాడా లేక వారివారి పోర్షన్లకు మటుకే తెలియజేస్తారా ?
కొంతమంది కథ చెపుతారు,మరికొంతమంది పోర్షన్ల వరకే చెపుతారు,మరికొందరు ఏమీ చెప్పరు.

మీకు నేను వెనుక ఒక ఉత్తరము వ్రాయగా , దానికి జాబు వ్రాయకపోవుటకు కారణము తెల్పదరా ఒక ప్రముఖ ఆంగ్ల సినీవార పత్రిక “యింటర్ వ్యూలో “ సినిమా ప్రేక్షకుల అభీప్రాయములమీదనే ఆధారపడుచుందును. దినమునకు ముప్పదివరకు ఉత్తరములకు సమాధానములిస్తూ యుంటాను అని చెప్పితిరిగదా ఇందులోని ఆంతర్యమేమి?
తీరిక ఉన్నంతవరకూ జవాబులు వ్రాస్తూంటాను.

పాఠకులు పంపిన సమాధానాలు ఇస్తారా లేక సంపాదకులకు కూడా ఏమైనా బాధ్యత వుంటుందా?
ఈ జవాబు నేనే ఇస్తున్నాను.

మీరు యికమీదట “విజయ”వారి చిత్రాలలో నటిస్తారండి?
ఏమండీ అంత సందేహం కలిగింది!

మీరు , భానుమతి ఇద్దరు కలిసి నటించిన చిత్రం ఏదైనా వున్నదా అండి?
ఇంతకుముందెప్పుడూ నటించలేదు. ఇకముందు నటించనున్నాము.( “మిస్సమ్మ”లో)

విజయవారి “చంద్రహారం” లో వలపుపాట వినగానె అన్న పాట మీదేన అండి?
కాదు… కోమల పాడింది.

“పెళ్ళిచేసిచూడు” లో జోలపాట జి. వరలక్ష్మి , మీరూ కలిసిపాడేరా లేక ఎవరైనా పాడేరా?
జి. వరలక్ష్మిగారూ, సరస్వతీ దేవిగారూ పాడారు.

మీరూ కృష్ణకుమారీ కలిసి ఎందులోనన్నా నటించారా?
ఆ…. నటించాం (“ప్రియురాలు”)

మన చిత్రనిర్మాతలలో అనేకులు తమ స్వార్థము కొరకు పనిచేస్తున్నారని కొందరి అభిప్రాయం కొంత వరకూ ప్రజాహితము కొరకే పనిచేస్తున్నారని నా అభిప్రాయం దానికి మీ సమాధానం?
రెండిటికీ పనిచేస్తున్నారు.

సినిమాలవలన మనదేశపు నవయువతీ యువకులలో ఎట్టి చైతన్యము రేకెత్తినదో తెలుపగలరా?
ప్రతీవాళ్ళూ సినిమాలలో చేరాలనే చైతన్యం…

మీరు నాగేశ్వరరావుతో ప్రస్తుతము చాలా చిత్రలలో నటించుచున్నారు. కారణం?
నిర్మాతలు మమ్మల్నిదద్దర్నీ బుక్ చేయటమే కారణం

మీరు నటించిన మొదటి చిత్రం “ సంసారం” అని నేను, కాదని నా స్నేహితుడు వారంచుకుంటున్నాము. యిందులో ఎవరిది తప్పు?
మీ స్నేహితుడిది తప్పు.

కనకతారలో నటించిన కన్నాంబ మొదటి చిత్రమేది?
“కినిమా” వారిని అడిగి తెలుసుకోండి.

పార్వతీ మీకు మాటయిచ్చి దేవదాసు మిమ్ము చేరకుండగనే మరణించాడేం? ఆఖరికి మీ భర్త మీకు దేవాదాసు దర్శనముకూడ లేకుండా చేశాడేం ఎందుకో తెలియజేస్తారా?
ఈ సందర్భంలో శరత్ చంద్రబాబు వుంటే ఎంత బాగుండేది.

మీరు “పెంపుడు కొడుకు” చిత్రములో బావిదగ్గర పూలచెట్లకు నీరుపోయుచు, పాడినపాట హిందీ చిత్రము “ఆన్ లోని పాటను అనుకరించినట్లు తలుస్తాను. నిజమేనా
నిజమే.

మీరు హిందీ చిత్రములలో గొప్ప నటీమణుల నటనను చూచి అలాగే, అనుకరిస్తూ నటిస్తారని విన్నాను నిజమేనా?
అలాంటి అలవాటు లేదు.

నీకెట్టి పాత్రయనిన అభిమానము మెండు?
శక్తి సామర్థ్యాలుగల ఏ పాత్రనైనా అభిమానంతో నటిస్తాను.

అట్టిపాత్ర నీ విప్పటివరకు వేసిన ఏ చిత్రములోనైనా గలదా?
కలదు

సినీనటులు రాజకీయవేత్తలయి, రాజకీయవేత్తలు సినీ నటులయినచో నప్పుడు భావి భారత పరిస్థితి యెట్టుండును.
తలక్రిందులుగా నుండును

మీ నటీనటులకు డబ్బు విలువ, కష్టములనుభవించుట సహనము మొదలగునని తెలియునా?
తెలియును.

నీవు వేసిన చిత్రములలో నేవేవి శతదినోత్సవములు చేసుకొన్నవి?
“పెళ్ళిచేసిచూడు”, “దేవదాసు,” “బ్రతుకుతెరువు,” “ప్రతిజ్ఞ”.

“కినిమా” గురించి మీ అభిప్రాయమేమిటి సెలవిస్తారా?
మంచి ఆదర్శాలుగల పత్రిక.

మీ ఆటోగ్రఫీ తీయించి పంపుతారా?
ఆటోగ్రఫీ తీయించడం ఏమిటి సోదరా?

మీకు వివాహము జరుగక మునుపే మీ చెల్లిగారైన మారుతి వివాహము చేసుకొనుటకు కారణమేమి?
మారుతి మా చెల్లికాదు…ఆమె మా అక్కయ్య.

యువరాజు వేషమునకు ఎన్. టి రామారావు తగినవారని నా ప్రియమిత్రుడు కె. రామమూర్తి రెడ్డియు, ఏ. నాగేశ్వరరావు తగినవారని నా ప్రియసోదరుడు టి. రామచంద్రారెడ్డియు వాదములాడుచున్నారు. అందులకు నేను వారి పర్సనాలిటీని చూచి వారికి యిష్టమైన వారికి తీసుకొందురని నా అభిప్రాయము చెప్పితిని. ఇందులో మీరు ఎవరితో ఏకీభవిస్తారు.?
మీతో ఏకీభవిస్తాను.

మేము మీతో కలసి మాట్లాడవలసియున్నది. మేము మీ యింటికి వచ్చిన గౌరవించెదరా? అగౌరవించెదరా? మీ అడ్రసు తెలిపవలసినదిగా కోరుచున్నాను?
అగౌరవించే అలవాటు నాకు లేదు. తప్పకుండా మీతో మాట్లాడతాను. అడ్రసు 11 , వైద్యరామయ్యర్ వీధీ, త్యాగరాయనగర్, మదరాసు -17

”దేవదాసు” చిత్రంలో పాత్రను మీరు పోషించలేక పోయారు. భావాలను వ్యక్త పరచడంలో చాలా లోపాలున్నాయ్. తప్పు మీదా లేక దర్శకునిదా?
తప్పు నాదే కావచ్చు.

మీరెంతవరకు చదువుకున్నారు? మీకు వ్రాయను,మాట్లాడను ఎన్ని భాషలొచ్చు?
థర్డ్ ఫారం వరకు చదువుకున్నాను.తెలుగు,తమిళం,హిందీ మాట్లాడటంవచ్చు.

నేనిప్పుడు నటిస్తున్న చిత్రాలుః
జనాతావారి “పరివర్తన”; జంపన & నందివారి “మేనరికం” (తెలుగు) “కుడుంబం” (అరవం) జెమినీ వారి “ బహుత్ దిన్ హుయే” (హిందీ); విజయవారి ‘మిస్సమ్మ’ (తెలుగు), “మిస్సియమ్మ” (తమిళం);మోడరన్ థియేటర్స్ వారి 66 వ చిత్రం (తమిళం); వినోదా “కన్యాశుల్కం”, ఏ వి ఎమ్ వారి “వదినె” (తెలుగు), “ చెళ్లపిళ్లై ” (తమిళం).

గమనిక : 1954 జూలై “కినిమా” పత్రికలో కొమ్మారెడ్డి సావిత్రి పాఠకుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ప్రచురింపబడింది. ఆ పత్రికలో ప్రచురించిన ప్రశ్నలు-జవాబులు యధాతధంగా మీకు ఇవ్వటం జరిగింది. కొన్ని ప్రశ్నలకు సావిత్రి ఇచ్చిన జవాబులు చూస్తే ఎంత తమాషాగా, సరదాగా ఆమె మాట్లాడేదో అర్దమవుతుంది. . సావిత్రి అభిమానులు చదివి ఆనందిస్తారనే సదుద్దేశ్యంతోనే ఈ సేకరణను ప్రచురించటం జరిగింది. ధాంక్స్ టు “కినిమా”