Movies | Music | Music

ADVERTISEMENT

Raa Raa Movie Review - Srikanth Meka, Nazia

February 23, 2018
Vizi Charish Visions
Srikanth Meka, Nazia, Giribabu, Seetha, Narayana, Ali, Raghubabu, Posani Krishna Murali, Prudhvi, Jeeva, Chandrakanth, Adurs Raghu, Hema, Shakalaka Shankar and Nalla Venu
Cinematography: Poorna
Fights: Gille Sekhar
Editor: Shankar
Presenter: Srimita Chowdary
Rap Rock Shakeel
Vijay
Vizi Charish Unit

పోరా (శ్రీకాంత్ ‘రా..రా..’ మూవీ రివ్యూ)

తెలుగు సినిమాకు తాము ఇంత లోకవ అయ్యిపోతామని దెయ్యాలు ఎప్పుడూ ఊహించి ఉండవు. ఓ టైమ్ లో భాక్సాఫీస్ కు హీరోల కన్నా తామే ముద్దు అని తెలుసుకున్నప్పుడు ఎంత ఆనందపడి ఉంటాయో ఇప్పుడు అంతకు మించిన విషాదంలో మునిగిపోయి ఉంటాయి. తమ మీద సినిమాలు తీయటం మొదలెట్టిన కొత్తల్లో రెమ్యునేషన్ డిమాండ్ చేయకుండా తమ గుడ్ విల్ ని ఇచ్చేసి సినిమాలను నిలబెట్టాలని ప్రయత్నం చేసాయి. అయితే రాను రాను వాటికీ డిమాండ్ తగ్గిపోయింది. ఏ దెయ్యం కథ చూసినా ఏమున్నది గర్వకారణం...దెయ్యం జాతి సమస్తం ..నవ్వురాని కామెడీ సినిమా అయ్యిపోయింది.

చివరకు ఎప్పుడో ఈ దెయ్యాలన్ని కలిసి మీటింగ్ పెట్టుకుని.. తమ పేరు చెడకొడుతున్నాయని , తెలుగు సినిమా నిర్మాతల మీద కేసు వేస్తాయోమో అనిపిస్తోంది. మీరు చుట్టిపారేసే సినిమాల కోసం మా జీవితాలను చెత్తగా చూపించవద్దని నిలదీస్తాయేమో అని డౌట్ వస్తోంది. ఏదైమైనా కొత్తలో కొద్ది రోజులు దెయ్యాలు కథలు కలెక్షన్స్ తో దడదడలాడించినా ఇప్పుడు దెయ్యం అంటేనే విరక్తి వచ్చేసే పరిస్దితి వచ్చేసింది. దెయ్యం సినిమా అంటే...నిర్వచనం మారిపోయింది... డబ్బులు లేనప్పుడు లో బడ్జెట్ లో సినిమాలు చుట్టేయాలనుకున్నప్పుడు తీసే సినిమా అని కొత్త అర్దం వచ్చి చేరింది. తనకు ఎంతో పెద్ద హిట్ ఇచ్చిన ప్రేమ కథా చిత్రం జోనర్ ని తెలివైన మారుతి ఎప్పుడూ రిపీట్ చేయలేదు. తనదైన శైలిలో ...మతి మరుపు కామెడీలు, ఓసీడి కామెడీలు,అతి మంచితనం సినిమాలు చేసుకుంటూ ముందుకు వెల్తూంటే.....మిగతా సినిమా జనం మాత్రం అక్కడే ఆగిపోయారు.

ఇలా దెయ్యం సినిమా పేరు చెప్తేనే ఇంత ప్రష్టేషన్ కక్కేస్తున్న టైమ్ లో తీరిగ్గా ..శ్రీకాంత్ .."నేను సైతం..ఓ దెయ్యం కథతో..." అంటూ మన ముందుకు వచ్చారు. దాంతో ఇప్పుడు రా..రా అని ఆయన్ని ఆహ్వానించాలా..లేక ఇంత లేటేంటి.... పోరా అని గెంటేయాలా అనే ఆలోచనలో జనం పడ్డారు. .అసలే శ్రీకాంత్ కు ఫ్యాన్స్ బాగా తగ్గిపోయి..అరకొరగా అక్కడక్కడా మిగిలారు. అయితే ఈ విషయాలన్ని సీనియర్ అయిన శ్రీకాంత్ కు తెలియక పోదు. అయినా ధైర్యం చేసారంటే ఆ కథలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అనిపిస్తోంది కదా..ఏమిటా ప్రత్యేకత...అసలు కథేంటి..శ్రీకాంత్ కు మళ్లీ డిమాండ్ తెచ్చే సినిమా యేనా ఇది...అనే విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ ఇదే...

తండ్రి (గిరిబాబు) పెద్ద పేరున్న సినిమా డైరక్టర్ కావటంతో కొడుకు రాజ్ కిరణ్ (శ్రీకాంత్) పైన కూడా ఆ పేరు భారం పడుతుంది. అయితే దురదృష్టవశాత్తు రాజ్ కిరణ్ తీసే సినిమాలన్నీ ..ఇప్పుడు నిజ జీవిత శ్రీకాంత్ సినిమాల్లా భాక్సాపీస్ వద్ద బెలూన్ లా పేలిపోతూంటాయి. దాంతో చివరకు కొడుకు కెరీర్ ని నిలబెట్టాలని ఆ తండ్రి పూనుకుని సినిమా నిర్మిస్తే అదీ అంతకు ముందు సినిమాల దారే చూసుకుంటుంది. దాంతో ఆయన ఈ దారుణం చూసి తట్టుకోలేక హరీమంటాడు. ఇది చూసిన రాజ్ కిరణ్ తల్లికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అప్పుడు ఆమెను బ్రతికించుకోవాలంటే కొడుకుగా ఓ సంతోషకరమైన పని ఏదన్నాచేసి చూపించమని డాక్టర్ సలహా ఇస్తాడు.

డాక్టర్ సలహా అయ్యితే ఇవ్వగలడు కానీ సినిమా హిట్ కు సూచనలు అయితే చేయలేడు కదా. దాంతో రకరకాలగా ఆలోచించిన రాజ్ కిరణ్ ..తెలుగులో హారర్ కామెడీలు బాగా ఆడుతున్నాయని ... (తన పేరు ఉన్న దర్శకుడు రాజ్ కిరణ్ తీసిన గీతాంజలి హిట్ గుర్తుకు వచ్చిందేమో).. ఆ జానర్ కే ఫిక్స్ అవుతాడు. అందుకోసం ఓ దెయ్యాలుండే ఓ పాడుపడిన ఇంట్లో చేరుతాడు. .ఆ భయపెట్టే ఎట్మాస్మియర్ లోనే కథ రాసుకుని, అక్కడే షూటింగ్‌ పూర్తిచేసి బయటికి రావాలి అనుకుంటాడు. అయితే ఆల్రెడీ అక్కడ కొన్ని దెయ్యాలు..లాంటి ఆత్మలు ఆవారా గా పని పాట లేకుండా తిరుగుతూంటాయి. అప్పుడు ఏమౌతుంది. ఈ నేఫద్యంలో రాజ్ కిరణ్ మంచికథ రాసుకుని హిట్ కొట్టాడా లేక ..‘రా..రా..’ లాంటి విషయంలేని హారర్ కామెడి తీసాడా..తల్లిని బ్రతికించుకున్నాడా...ఈ కథలో హీరోయిన్ నాజియా క్యారక్టర్ ఏమిటి ...అన్న విషయాలతో మిగతా కథ నడుస్తుంది.

జబర్దస్త్ కామెడీనే కానీ...

హారర్ కామెడీలతో నిజానికి తెలుగు జనాలకు విసుగెత్తినా..సరిగ్గా చేస్తే ఆనందో బ్రహ్మ సినిమాలా ఉన్నంతలో బాగానే చేసారులే అని ఆదరిస్తారు. ఈ విషయం సినిమా ఓకే చేసినప్పుడు ప్రస్దావనకు వచ్చి ఉంటుందేమో కానీ.. సినిమాలో ఆ కన్విక్షన్ పూర్తిగా మిస్సైంది. అలాగే టీవీలో వచ్చే జబర్దస్త్ ఎపిసోడ్స్ చూసి ప్రేరణపొంది స్క్రిప్టు రాసుకున్నట్లు అనిపిస్తుంది. అవే పంచ్ లు, వాళ్లే ఆర్టిస్ట్ లు. జబర్దస్ట్ షోలో పదినిముషాల్లో తేలిపోయే కామెడీ ఎపిసోడ్ ని ఇక్కడ రెండు గంటలు పాటు సాగ తీసారనిపిస్తుంది. హేమ,రఘుబాబులతో సాగే ఆ దెయ్యం ఎపిసోడ్స్ అన్ని సిల్లీగా ఉంటాయి తప్ప సీరియస్ గా కామెడీ చేయవు. విసుగు,బోర్ తెప్పిస్తాయి . శ్రీకాంత్ పాత్ర ..దెయ్యంతో ప్రేమలో పడటం అనేది ఎక్కడా జస్టిఫై అయ్యేలా, నమ్మశక్యంగా ఉండదు.

కావిడ దించేసాడు

శ్రీకాంత్ లో ఉన్న గొప్పతనం ఏమిటీ అంటే వయస్సు కనపడనీయకపోవటం. అప్పట్లో ఎలా ఉన్నాడో..హెయిల్ స్టైల్ తో సహా ..ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేయటం..అంతేకాకుండా ఫన్ లేని సీన్స్ ని కూడా తన అనుభవంతో ఫన్నిగా మార్చగలిగాడు. అయితే ఎవరైనా విషయంలేని స్క్రిప్ట్ ని ఎంతసేపు మొయ్యగలరు. అదే ఇక్కడా జరిగింది. సినిమా సగంలో కామెడీ కావిడ ని భుజం నుంచి దించేసుకున్నట్లుగా శ్రీకాంత్ రిలాక్స్ అయ్యి....ఎలాగోలా ఈ సినిమా పూర్తి చేయండరా బాబు అన్న ఫీలింగ్ చేసినట్లు అనిపిస్తుంది.

అందుకే డైరక్టర్ పేరు వద్దన్నాడేమో..

ఈ సినిమా షూటింగ్ అప్పుడు ఏవో విభేధాలతో తొలిగా మొదలెట్టిన దర్శకుడు మధ్యలో వెళ్లిపోతే వేరే సీనియర్ దర్శకుడుని పెట్టి ఈ సినిమా పూర్తి చేసారు. సదరు సీనియర్ దర్శకుడు సైతం తన పేరు సినిమాలో వేసుకోవటానికి కానీ మీడియా వద్ద అసలు బయిటపెట్టడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన అలా ఎందుకు ఇష్టపడలేదో ఈ సినిమా చూస్తే మనకు స్పష్టంగా అర్దమవుతుంది. ఆయన ఫెరఫెక్ట్ జడ్జిమెంట్ తో ఉన్నారన్నమాట.

మిగతా విభాగాలు

సినిమాలో మిగతా విభాగాలు విషయానికి వస్తే..ఎడిటింగ్‌ ఓకే. ఇలాంటి సినిమాలకు ప్లస్ కావాల్సిన మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లు కలిసి రాలేదు. సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణవిలువలు కూడా ఫరవాలేదు. క్వాలిటీగానే తీసారు. చందమామ పాట బాగా డిజైన్ చేసారు.... ఆ పాటలో గ్రాఫిక్స్‌ కూడా బాగున్నాయి.

ఫైనల్ థాట్

ఈ సినిమా చూడటమే ఓ హారర్ ... దాని గురించి మాట్లాడటమే ఓ కామెడీ.

చూడచ్చా...

ఇంత చదివాక ఇంక ఈ ప్రశ్న వేయరని మాకు స్పష్టంగా తెలుసు.

 Other Links:   Movie Info   Galleries   Functions   Preview  
ADVERTISEMENT