Movies | Music | Masti Close Aha Ad
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


Tribute to Padma Bhushan Dr C. Narayana Reddy

స్వర్గంలో మీతో తగుపుపెట్టుకుంటా,రెడీగా ఉండండి

అవును...స్వర్గానికి వచ్చి మరీ... మీతో ఖచ్చితంగా తగువుపెట్టుకుంటా...ఎందుకంటారా.....ఇలా మీ పెద్దవాళ్లంతా వరస పెట్టి ఇక్కడేదో పనైపోయినట్లు మీ దారి మీరు చూసుకుంటే...మా గతేం కాను...మిమ్మల్ని ఆపేవాళ్లు లేరనా అలా అర్జెంటుగా వెళ్లిపోయారు. అవునూ మీరు ఇలా చెప్పాపెట్టకుండా వెళ్లిపోతే..రేపటి నుంచీ మమమ్మి అదలేంచే వాళ్లు ఎవరు...ఆలోచించి దారిలో పెట్టేదెవరు...మొన్న దాసరి, ఇవాళ మీరు (సినారే). మీకేం మీరు హ్యాపీగా వెళ్లిపోయారు. కానీ ఇక్కడ మమ్మల్ని సాహితీ ప్రపంచంలో ఒంటిరిని చేసి వదిలేసారే...అదైనా మీకు గుర్తుందా..మీరే తెలుగు సాహిత్యానికి కొత్త సంగతులు పరిచయం చేసారు. తెలుగు కవిత్వానికి కొత్త సొబగలు అద్ది మాకు ఆ రుచి చూపించారు. తెలుగు సినిమా పాటను ఇలా కూడా అద్బుతంగా రాయొచ్చు అంటూ కొత్త కొత్త పద ప్రయోగాలతో సింపుల్ గా ఉంటూనే సమద్రమంత అర్దాన్ని చూపటం నేర్పించారు. ఇన్ని అలవాట్లు చేసేసి, మీరొక వ్యసనంగా మారిపోయాక...ఓ పెద్ద దిక్కు మేముంతా భావిస్తున్న టైమ్ లో మమ్మల్ని వదిలేసి మీ మటుకు మీరు వెళ్లిపోతే మేము ఏమైపోతాం.

ఇన్నాళ్లూ మీరు ఉన్నారన్న ధైర్యం... తెలుగు సాహిత్యాన్ని, మమ్మల్ని అంటిపెట్టుకుని ఉంది. ప్రేరేపించాలన్నా మీరే, ప్రేరణ పొందాలన్నా మీరే, అసలు చాలా సార్లు ప్రేరణా మీరే అన్నట్లుగా మీ కవి..జీవితాన్ని కొనసాగించారు. మీ మాటలు లేని సభలు ఎంత మూగపోతాయో..మీకు తెలియదేమో...మాకు బాగా తెలుసు... ఓ పెద్దాయనా ...నాకు తెలియక అడుగుతాను...ఇంకో పాతికేళ్లో ,ముప్పై ఏళ్లో ఉండచ్చు గా...ఆ తర్వాత ఆలోచిద్దుము కదా...ఈ లోగా ఎన్నో కవితా కబుర్లుచెప్పుకుందుము కదా. అంటే మీరు ఇలా వెళ్లిపోతే... మేము మళ్లీ మళ్ళీ మీరు రాసిన పాటలే వింటూ, మీరు రాసిన కవితలు చదువుతూ గడిపేయాలనే కదా...మీ ఆలోచన. ఎంత నిర్ధయపూరితమైన నిర్ణయం... కొత్త కొత్తగా మీరు అలవోకగా రాస్తూ పోతూ ఉంటే..మేము అలా..అలా ఆనందంగా చదువటానికి అలవాటు పడ్డాం.

అయినా ఎంత ఓపిక ఇచ్చాడయ్యా దేవుడు... ఓ సారి పదిలైన్ల కవిత రాస్తే, మరోసారి సినిమా పాట అందుకుంటావు..అక్కడితో ఆగుతావా... పద్య కావ్యం, ఇంకోసారి గేయ కావ్యం, వచన కవితలు, గద్య కృతులు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు ఇలా ప్రతీసారి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఏదో కొత్తదనాన్ని ఇస్తూ వచ్చావు. ఇప్పుడు మళ్లీ నీలాంటి కవి మాకు దొరుతాడా...అల్టర్నేటివ్ లేకుండా మా మనస్సుల్లో ఎదిగిపోయావు కదయ్యా...కొత్తగా ఇప్పుడు మేము వేరే రైటర్ల కవితలకు అలవాటు పడాలంటే అది జరిగేపనేనా...వాళ్లు ఎంత గొప్పగా రాసినా నీ ముందు సూర్యుడు ముందు దివిటీలు అయ్యిపోరూ...

"రాస్తూ రాస్తూ పోతాను-సిరా ఇంకేవరకు-పోతూ పోతూ రాస్తాను-వపువువాడేవరకు''

అన్న నీ మాట మీద నిలబడి...చివరి క్షణం వరకూ ... 'కవిత్వం నా మాతృభాష', 'కవిత నా శ్వాస', 'కవిత నా చిరునామా' అంటూ ఓ కవిగా సజీవంగా ఉన్నావు..అక్కడిదాకా సంతోషమే. కానీ అర్దాంతరంగా ఇలా చెప్పాపెట్టకుండా చెయ్యిచ్చిస్తే..మేము ఇక ఎవరి చేయి పట్టుకుని నడవాలి, ఎవరి చూపుడు వేలుతో ప్రపంచాన్ని చూడాలి.

''ఏదైనా రాయందే
ఈ క్షణాన్ని పోనీయను
కలాన్ని పిండేయందే
కాలాన్ని కదలనీయను
అవసరమైనప్పుడల్లా
అగ్నిపుల్లతో-చీకటి
కొవ్వును కరిగించందే
కొత్తపొద్దు రానీయను''

అని ప్రతిజ్ఞ చేసావు కదా...నువ్వు వెళ్లిపోయాక...కొత్త పొద్దు రావటానికి ఎంత టైమ్ పడుతుందో...ఇలా ఇంత ధీమాగా...చెప్పేవాళ్లు ఎవరొస్తారో...అని ఒక్క క్షణం ఆలోచించినా ఇంత తొందరపాటు నిర్ణయం ఖచ్చితంగా తీసుకోకపోదువు..

నువ్వు మామూలు వాడివా...హైస్కూలు చదువు కోసం హైదరాబాదు వచ్చిన నువ్వు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో పుస్తకాలన్నీ చదివి ప్రమాణికమైన సారస్వత సారాన్ని ఆకళింపు చేసుకున్నావు. 1953లో ‘నవ్వనిపువ్వు’ పేరుతో వెలువరించిన తొలికవితా సంపుటి మమ్మల్ని అందరినీ మెప్పించావు. 22 ఏళ్ల ప్రాయంలోనే ‘విశ్వగీతి’ కవితలు, ‘నాగార్జునసాగరం’, ‘స్వప్నభంగం’, ‘కర్పూరవసంతరాయలు’ వంటి కవితా సంపుటాలు రచించి అగ్రశ్రేణి కవిగా గుర్తింపు పొందావు. 1962 నాటికి కళాశాల అధ్యాపకుడిగా మన్ననలు, ఎన్టీరామారావు కోరికతో సినీకవిగా ‘నన్నుదోచుకుందువటే వన్నెలదొరసాని’ పాటతో దూసుకుంటూ వెండితెరపై నుంచి రసాలు ఊరే కవితలను తెలుగువారిపై చిలకరించావు. 3675 పాటలతో పరవశింపజేశావు.

తెలుగుతనానికి నిలువెత్తు సంతకంలా.. భాష సంస్కృతికి సంబంధించిన అన్ని వేదికలపై 60 ఏళ్లుగా పెద్దదిక్కుగా దారి చూపిస్తూ వస్తున్నావు. ‘విశ్వంభర కావ్యం’ తో జ్ఞానపీఠ్‌ (1988)పురస్కారాన్ని పొందావు. 1977లో పద్మశ్రీ, 1978లో కళాప్రపూర్ణ, 1992లో పద్మభూషణ్‌ మిమ్మల్ని వరించాయి. ఎవరికి సాధ్యం ...ఇన్ని అద్బుతాలు ఒకే కలం సాధించంటే నమ్మగలమా. నువ్వు శభాషబ్బా...కానీ...మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్లి పోయి...ఏడిపించటమే ఏమీ బాగోలేదు.. ఇంకోసారి ఆలోచించండి అనే అవకాసం ఇవ్వకుండా వెళ్లిపోయిన మీరంటే పీకలదాకా కోపం ఉంది. స్వర్గంలో మనం కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయమై మీతో దెబ్బలాట పెట్టుకుంటా...రెడీగా ఉండండి...

-Ragalahari Team

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT