Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


Sakshi completed 50 Years

‘సాక్షి’ సినిమా కు 50 ఏళ్లు..అయితే ఏంటి?

యేడాది క్రితం ఇదే వారం రిలీజైన తెలుగు సినిమా పేరు చెప్పండి అంటే ఎంత తలబ్రద్దలు కొట్టుకున్నా గుర్తుకు రాదు..గూగుల్ చేసి చెప్పాలి. అంటే దానర్దం ...మన జ్ఞాపక శక్తి తక్కువని కాదు...అంత గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీలేదని వదిలేస్తాం. ఎక్కడో కొందరు వీరాభిమానులు తమ హీరో సినిమా ఫలానా రోజు రిలీజైంది..ఫలానా సెంటర్లో ...ఇన్ని రోజులు ఆడింది..ఇంత కలెక్ట్ చేసింది వంటి విషయాలు తరుచూ మననం చేసుకుంటూ ఉంటారు..కాబట్టి వాళ్లకు గుర్తుంటాయి. అలాంటిది ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం రిలీజైన సినిమాని గుర్తు చేసుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా. అంటే ఖచ్చితంగా ‘సాక్షి’ సినిమాకు ఆ అర్హత ఉందనే చెప్పాలి. ఎందుకని పాతదంతా గొప్పదైపోతుందా..గొప్పదని పొగుడుతూ గుర్తు చేసుకోవాల్సిందేనా..ఇంతలా ఓ పాత సినిమాని గుర్తు చేసుకుంటున్నారు..అదేమన్నా ఆ రోజుల్లో బాహుబలిలాగ ఆడిందా అని మీరు అడగొచ్చు.

ఈ సినిమా కమర్షియల్ గా బాహుబలి కాకపోవచ్చు కానీ కంటెంట్ రీత్యా..బాహుబలికే బాహుబలిలాంటిదని చెప్పచ్చు. ఇందులో ఏమిటి స్పెషాలిటి అంటే... కనీసం షూటింగ్ అయినా చూసిన అనుభవం లేని...బాపు ఈ సినిమా దర్శకుడు అవటమే ఓ విశేషం అని చెప్పచ్చు. అక్కడితో ఆగారా... అప్పటికి స్టార్‌డమ్‌లేని ..హీరో కృష్ట విజయనిర్మలని మెయిన్ లీడ్ కు తీసుకున్నారు... అదీ మేకప్‌ లేకుండా నటించేందుకు బాపు నిర్ణయం చేసారు. అప్పట్లో చెన్నైలో స్టూడియోల్లోనే ఎక్కువగా షూటింగ్స్‌ జరిగేవి. ఔట్‌డోర్‌లో చాలా తక్కువగా చేసేవారు. కానీ ‘సాక్షి’ని పూర్తిగా ఔట్‌డోర్‌లోనే ప్లాన్ చేశారు బాపు. స్నేహితుడు కోసం అప్పు చేసారు..నయయుగ బ్యానర్ వాళ్లని రిక్వెస్ట్ చేసి మరీ సినిమాని నిర్మించారు ముళ్ళపూడి వెంకట రమణ. తన ప్రాణమిత్రుడుని దర్శకుడుగా చూడటానికి రమణ రిస్క్ చేస్తే...బాపు మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఆలోచించండి. అయినా ఎక్కడా జంకేది లేదన్నట్లుగా ...కమర్షియల్ అంటూ కక్కుర్తి పడకుండా తాము అనుకున్నది అనుకున్నట్లు తీయటానికే ఫిక్స్ అయ్యారు. వాళ్లకు ఎంత ధైర్యం అంటే...1967 ప్లవంగ నామ సంవత్సరం. కానీ అదేం కాదు.. ‘సాక్షి’ నామ సంవత్సరం అని ప్రకటించారు.

ఇంతకీ కథేంటి..

దారంపాడు ఒక మారుమూల పల్లెటూరు. కాలవలకీ,గోదావరి పాయిలకి మధ్యనున్న చిన్న లంక. ఊరు దాటి బస్తీ వెళ్లాలంటే నీరు దాటి మట్టి రోడ్డు మీద నడిచి హైవే రోడ్డుకు చేరాలి. కొట్టరి తోటలు అక్కడ వారి ముఖ్య వ్యావృత్తి. కొబ్బరికాయలు, పీచు వగైరాలు బస్తీకి రవాణా చేయటానికి ఆ ఊరి మునసబు గారు ఒక పాత లారీ కొన్నారు.

ఆ వూరి పాలిట పీడ ఫకీరనే పెద్ద రౌడీ. వాడి దౌర్జన్యాలకు అంతులేదు. వాడి మీద ఫిర్యాదు చేస్తే జైలుకు పంపినా, శిక్ష కాగానే వచ్చి, పంపిన వాళ్ల పంటకుప్పలు, గడ్డి వాములు తగలెడతాడు. ఆ భయం కొద్ది ఎవరిమటుకు వాళ్లు సర్దుకుపోయారు.

మునసబు గారు గడుసుగా ఆలోచించి, ఆ రౌడీ తన చెప్పు చేతల్లో ఉంటాడని, తన లారికి వాడికి డ్రైవర్ గా వేసుకున్నారు. వాడు కిరాయికి వెళ్తే సరుకంతా అమ్మి, ఆ డబ్బు తిని, తాగి జూదమాడేసేవాడు. గట్టిగా అడిగితే తంతాడు. లారి వదలమంటే వదలడు. అంతా యధాప్రకారం నష్టాలు దిగమించి వాడితో మంచిగానే ఉంటున్నాడు.

ఈ స్దితిలో వాడి పాపం పండి ఒక రాత్రి తోటకాపాలవాళ్లు ఇద్దరిని హత్య చేసాడు. అక్కడితో గ్రామస్దులంతా ఏకమై , ఆ హత్యలు చూసిన సాక్షిని, ఒక సామాన్యుడుని,బల్లకట్టు తోలేవాడిని పట్టుకున్నారు. నువ్వు వీరుడివని పొగిడారు. నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు అని హామీ ఇచ్చారు. ఇకనైనా మేమూ మా బిడ్డా పాపలూ చల్లగా ఉండాలంటే ఇదే అవకాసం అని బ్రతిమిలాడారు. కోర్టులోల వాడిచ్చే సాక్ష్యం ఇప్పించారు.

కానీ తీరా విచారణణలో కథ అడ్డం తిరిగింది. ఆత్మరక్షణ కోసం ఫకీరు ఆ హత్యలు చేసాడన్న వాదం నిలబడినందువల్ల కోర్టు వారు వాడికి ఉరిశిక్ష బదులు ఏడేళ్లు జైలు శిక్ష విధించారు.

ఫకీరు జైలుకు పోతూ పోతూ సాక్ష్యం చెప్పిన బల్లకట్టువాడి మీద పగ ప్రకటించాడు. పది రోజుల్లో వచ్చి చంపుతానని బెదిరించాడు. గ్రామస్దులంతా ఎక్కడి వాళ్లక్కడి బెదిరి పారిపోయారు. బల్లకట్టువాడికి పని పోయింది. వాడికి ఆశ్రయం ఇవ్వటానికి పట్టెడన్నం పెట్టడానికి ఎవరూ సాహసించలేదు.

భయపడినట్లే ఒకనాడు ఫకీరు జైలు నుంచి తప్పించుకుని వచ్చాడు. ఆ వేళకు బల్లకట్టు కిట్టప్ప అప్పుడే పెళ్లి చేసుకున్నాడు. ఫకీరు వచ్చాడనగానే గ్రామస్దులంతా ఇళ్లళ్లోకి దూరి తలుపులు వేసుకున్నారు. కాళ్ల పసుపు, పారాణి కొత్త దంపతులు ఇంటింటికి వెళ్లి మొరపెట్టుకున్నారు.

మీ కోసం , మీ బిడ్డా పాపలకోసం, మీ పసుపు కుంకాల కోసం నా మొగుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు నా తాళిబొట్టు పెరిగిపోకుండా కాపాడండి..అంటూ ఆ ఇల్లాలు ఆశ్రోశించింది. ఇద్దరూ నడివీధిలో నిలబడి దీనాతిధీనంగా బ్రతిమిలాడారు.

ఊరువారంతా చెవులు మూసుకున్నారు. కళ్లు మూసుకున్నారు. హృదయాలు మూసుకున్నారు. పదిమందీ కలిస్తే అడ్డు పడవచ్చు. కానీ ముందు దెబ్బ ఎవరికి తగుల్తుందో...

వీధిలో ఎవడో దెబ్బ తింటే మనకేమిటని ఎవరికి వారు ఊరుకున్నారు. కానీ అది నిజమా...ప్రక్కింటికి నిప్పు అంటుకుంటే అలాగే తలుపులు మూసుకుని కూర్చోగలరా..చెరువులో రాయేస్తే ఆ తాకిడి తగలని నీటిబొట్టు ఉంటుందా... అలాంటి పరిస్దితుల్లో ఆ బల్లకట్టువాడు తెగించి ఓ నిర్ణయం తీసుకున్నారు..చివరకు గదిలో పెట్టిన బంధించిన పిల్లి తిరగబడినట్లు తిరగబడ్డాడు. అదెలా అనేది తెరమీద చూసి తీరాల్సిందే.

(ఈ కథ అప్పట్లో ఈ సినిమా రిలీజ్ సమయంలో సినిమా ప్రమోషన్ కోసం రాసింది)

ఈ కథ ఇలా పుట్టింది...

ఇక అప్పటికే పత్రికల్లో రాసే మంచి కథా రచయితగానే కాక , సినిమా రచయితగా పేరు తెచ్చుకున్న ముళ్లపూడి వెంకట రమణ .. గ్యారీ కూపర్‌ నటించిన కౌబాయ్‌ చిత్రం ‘హైనూన్‌’ చూడటం జరిగింది. ఆ కథ ఆయన్ని కొద్ది రోజులు పాటు వెంటాడింది. ఆ కథ ప్రేరణతో ..అప్పటికి లీడింగ్ లో ఉన్న ఆంధ్రపత్రిక వారపత్రిక 1959 అక్టోబర్‌ 28 సంచికలో ‘ఎస్‌.పార్థసారథి’ పేరుతో ‘సాక్షి’ అనే కథ రాశారు. చిత్ర కథను చాలావరకూ అలా పత్రికలో ప్రచురింపబడిన సాక్షి కథనే ఆధారంగా చేసుకుని తయారుచేసుకున్నారు. పత్రికలో వచ్చిన కథలో చివరకు హీరో పాత్ర కూడా మంచి వాడు కాడు అన్న‌ విషయం తెలుస్తుంది. ఐతే సినిమాకు అనుగుణంగా ఆ విషయాన్ని తీసివేసి సినిమా హీరోని అమాయకుడిగా మార్చేశారు.

ఏముంది ఈ సినిమాలో అంత గొప్ప...

ఈ సినిమాలో కథంతా చాలా సహజంగా ...ఆ కాలంలో వచ్చిన 'బైస్కిల్ థీవ్స్‌' , 'పధేలి పాంచాలి‌' తరహాలో సినిమా సాగుతుంది. మనకు తెలిసున్న వ్యక్తే...మనకు తెలుసున్న ఊళ్లోనే ఈ సమస్యను ఎదుర్కొంటే ఆ విషయం మనం లైవ్ లో చూస్తున్నట్లుగా చిత్రీకరించారు బాపు. తొలి సినిమా అంత అద్బతంగా తీయగలరని ఎవరూ ఊహించరు. అది ఆయన స్టోరీ బోర్డ్ వేసుకోవటం వల్లే సాధ్యమైంది అంటారు కాని...అది నిజం అనిపించదు. ఆయనలో ఆ స్దాయి ప్రతిభ ఉంది కాబట్టే అంత గొప్పగా ఈ సినిమాని ఆవిష్కరించగలిగారు.

ఇక సినిమాలో కొన్ని సన్నివేశాలు హైలెట్ అనిపిస్తాయి. ముఖ్యంగా విలన్ జైలునుంచి బయిటకు వచ్చేసరికి ఊళ్లో ఎవరూ ఆసరాగా హీరోకి నిలబడరు. హీరోయిన్ అండగా ఉండి...అత్త కడుపు చల్లగా...అమ్మ కడుపు చల్లగా బతకరా బతకరా అని పాట పాడి మరీ తాళి కట్టించుకుంటుంది. అప్పుడైతే తన అన్న ఏమీ చేయడని భరోసా ఇస్తుంది. ఆ సీన్స్ లో బాపూ విశ్వరూపం కనపిస్తుంది. తొలి సినిమాకే ఇలాంటి సాహసోపేతమైన కథను ఎంచుకోవటం...గోదావరి సౌందర్యాలను, మనోహరమైన సంగీతంతో ముడిపెడుతూ... అర్దవంతమైన ఇతివృత్తాన్ని ఎన్నోకుని, ఎలాంటి క్లిష్ట పరిస్దితుల్లో అయినా ధైర్యంతో చెడును ఎదిరించటం సాధ్యమే అనే సందేశం కూడా అందించారు. నిజానికి సినిమాలో విలన్ ..జగ్గారావు అనిపించడు. హీరోలో ఉన్న భయం అనే మానసిక స్దితే..విలన్ అనపిస్తుంది. సినిమా మొత్తం ఈ భయం చుట్టూ డిచి..చివరకి పిరికివాడు ఆ భయాన్ని జయించి సాధించాడు అని చూపించారు. భయం ఉన్నవాడు బ్రతికినా చచ్చినట్లే అని తేల్చి చెప్పారు.

ఈ సినిమా గురించి చెప్పుకునేటప్పుడు కేవలం దర్సకుడు బాపు, అద్బుతమైన రచన చేసిన రమణ గురించే కాకుండా హీరో కృష్ణ గారు గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే.. గూఢచారి 116 లాంటి మాస్ మసాలా సినిమా విడుదలయ్యాక ఎవరైనా అదే తరహా సినిమాలు వరసపెట్టి చేసుకుంటూ పోతారు. ఇలాంటి ఆర్ట్ తరహా సినిమాలు, అదీ కొత్త దర్శకుడుతో అంటే అసలు దగ్గరకి రానివ్వరు. కానీ కృష్ణ సాహసి. ఆ ఇమేజ్ ని ప్రక్కనపెట్టి...మేకప్ లేకుండా..సాక్షి సినిమా చేశారు. బల్లకట్టు కిట్టయ్య పాత్రలో ఒదిగిపోయి...సహజంగా నటించారు.

ఇవి కూడా...జరిగాయి

‘సాక్షి’ చిత్రంతో పరిశ్రమకి పరిచయమైన నటుల్లో రంగావఝుల రంగారావు కూడా ఉన్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ‘సాక్షి’ రంగారావుగా చిత్రపరిశ్రమలో కొనసాగారు. ఆయన కుమారుడు కూడా సాక్షి పేరుతోనే కొనసాగటం విశేషం.

అలాగే...తాష్కెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సహా చైనా, మంగోలియా తదితర దేశాల్లో 18 నెలల పాటు ‘సాక్షి’ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. తొలి సినిమాతోనే ఇలా అరుదైన గౌరవం అందుకొన్నారు బాపు.

కృష్ణ విజయనిర్మలల ప్రేమాయణం ఈ చిత్ర షూటింగులోనే ఆరంభ మయ్యింది. దాంతో వారిద్దరు ఒక్కటి కావాలనుకున్నారు. అయ్యారు.

కంక్లూజన్...

బాపు డైరక్ట్ చేసిన తొలి చిత్రమనో, లేక సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రమనో కాకుండా...తెలుగులో వాస్తవిక ధోరణులుకు అద్దం పడుతూ, ఆ కాలంలో వస్తున్న చిత్రాలకు భిన్నంగా ఓ కొత్త తరహా ప్రయోగంగా నిలిచిన చిత్రంగా 'సాక్షి' గురించి ఖచ్చితంగా ఇంకో వందేళ్లు అయినా మాట్లాడుకోవాలి. ఎప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకోవటం ఆపాలంటే 'సాక్షి' లాంటి సినిమాలు బోలెడన్నీ ఎటు చూసినా వచ్చేసినప్పుడు, దీని ప్రత్యేకత కనపడకుండా పోయినప్పుడు. కానీ చూస్తూంటే సుదూర తీరంలో అలాంటి పరిస్దితి కనపడటం లేదు కాబట్టి..అప్పటివరకూ ఇలా మరీ యాభై ఏళ్లు గ్యాప్ కాదు కానీ...కాస్త తక్కువ గ్యాప్ లో మాట్లాడుకుంటూ ఉంటే ఈ తరం దర్శకులకు ఎవరికైనా ఇలాంటి సినిమాలు మళ్లీ ఎందుకు తీయకూడదు అనే ఉత్సాహం పుట్టచ్చు..అదే కంటిన్యూ కావచ్చు...చేతనైంతలో ఇలా గుర్తు చేసుకోవటం ద్వారా... మన సినిమాని మార్చుకునే ప్రయత్నం చేయచ్చు.