Movies | Music | Masti Close Aha Ad
Watch Latest Movies & Web Series on AHA!
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


Warning to Film Producers!

నిర్మాతలకు హెచ్చరిక..

(మహానటి సావిత్రి గురించి,ఆమె తండ్రి గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన ఆర్టికల్)

నిన్న మొన్నటివరకూ నెలకు మూడు వందలు తీసుకుని నటించే సావిత్రి ఈనాడు చిత్రానికి 20 వేలు డిమాండ్ చేస్తోందిట. ఇరవై వేలు తీసుకునే అర్హత సావిత్రికి ఉందా లేదా అన్న విషయం అప్రస్తుతం. 'కళ' కి విలువలేదుగా.సావిత్రి విలువ అమూల్యం కావచ్చు.అసమాన్యం కావచ్చు.

కాని నిర్మాతలింకా స్టార్ వ్యాల్యూ మోజు మీద సావిత్రం వంటి తారలను ఇరవై లేక నలభై వేలు ఇచ్చి బుక్ చేసుకోవటం ప్రస్తుత ఆర్దిక ప్రతిష్టంభన దృష్టిలో అది పరిశ్రమకు క్షేమం కాదు.

విడుదలైన అనేక చిత్రాలు దెబ్బ తిన్నాయి. అనేకమంది నిర్మాతలు నిలువునా కూలిపోయారు. మార్కెట్ లో ధనం లేకా, ఉన్నది కదలలేకా, నిర్మాణంలో ఉన్న చిత్రాలు మీన మేషాలు లెక్కపెడుతున్నాయి.

ఇటుపైని మొత్తం చిత్రం లక్షా లేదా లక్షన్నర రూపాయల్లో ముగించుకున్నవాడే ధన్యుడు. రంగంలో అనేకమంది మామూలు తారలు అసంఖ్యాకంగా ఉన్నారు. సావిత్రం కూడా నిన్నటి వరకూ మామూలు తారే.

స్టారు వేల్యూ మోజు మీద నిర్మాతలు ఆమె కోరినంత ధనమిచ్చి బుక్ చేసుకునేటంత ఆగత్యమైన పరిస్దితులు ఏమీ కనపడటం లేదు. ఇంతవరకూ ఆమె నటించిన చిత్రాల్లో ఒకటైనా భాక్సాఫీస్ హిట్ అనిపించుకున్నదున్నదా. అలాంటప్పుడు అనవసరంగా ఆమె స్టార్ వ్యాల్యూని మీరే కట్టబెట్టి. వేలం వెర్రిగా అందరూ బుక్ చేసి సమయానికి చిత్రం విడుదల చేయలేక బాధపడటం దేనికి?.

నేటి పరిశ్రమ అనేక విధాలుగా తారుమారైంది. పుష్కరం నుండీ తారాపధంలో వెలుగుతూన్న తారలతో నిర్మించిన చిత్రమైనా విజయవంతం కావటంలేదు. కనీసం పెట్టుబడి ధనమైనా తిరిగి రావటం లేదు. జెమినీ, ఏవియం వంటి ఆర్దిక పుష్టిగల స్టూడియోలే తమ సిబ్బందిని తగ్గించి వేసాయంటే, ఆర్దికంగా పరిశ్రమ ఎంత చితికి పోయిందో ఆలోచించండి.

తారల వల్లే చిత్రాలు విజయవంతమౌతాయనే పాత నమ్మకానికి స్వస్ది పలకాలి. అందుకు నిదర్శనం మీ భాక్సాఫీసులే. లక్షకి లక్షలు తారల కోసం వ్యయపరిచి చిత్ర పరిశ్రమని శాశ్వతంగా గంగలో కలపకండి.

చౌదరిగారూ ఆత్మ పరిశీలన చేసుకోండి

సావిత్రిని సినిమా రంగంలో ప్రవేశపెట్టడానికి వీరు ఎన్ని బాధలు పడ్డారో ఒక్కసారి వెనక్కు తిరిగి చూచుకోవటం చాలా అవసరం. ప్రప్రధమంగా 'మోహిని' లో ఆమె త్రివర్ణ ముఖచిత్రం ప్రచురించిన తరవాతనే సావిత్రికి పిలుపు వచ్చింది...కానీ అనేక అడ్డంకులు రావటంతోనే, పబ్లిసిటి ఆగత్యం అనే నగ్న సత్యాన్ని గ్రహించిన చౌదిరిగారు సావిత్రితో కలిసి రూపవాణి కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చి వెళ్లేరో లెఖ లేదు. ఉగాది సంచికలో సావిత్రి ఇంటర్వూ అచ్చులో ఉండగా బ్రాడ్వేలో మా ప్రెస్ కు ఎన్నిసార్లు విజయం చేసారో జ్ఞాపకం ఉంచుకోవాలి.

ఆవేదన, ఆతృత , ఆ మాదిరిగా ఉండటం సహజం. ఒక తార ముందుకు రావాలంటే ఎంత ప్రయాస ఉందో, ఎంత పలుకుబడి కావాలో చౌదరిగారికి బాగా తెలుసు. కాస్త పైకి రాగానే పాత విషయాలను మరిచిపోవటం సహజమే ఐనా, అవి పరిశ్రమకు కానీ, పత్రికలకు కానీ ఏమీ హానీ చెయ్యవు, తమకే కీడు కలుగుతుంది.

సావిత్రి తార కాక పూర్వం చౌదరి, నిర్మాతలకు చూపించిన అణుకువగా, సృహద్భావం గానీ నేడు లేవు. ఉంటే రేవతి స్టూడియోలో తన మోటారు టైర్లు కోసి వేసే ఆగత్యం ఎందుకతు పట్టింది? జి. వరలక్ష్మి చెయ్యి చేసుకునే అవకాసం ఎందుకు కలిగింది? పైకి రావటంలో ఎంత కష్టం ఉందో, వచ్చిన తర్వాత ఆ స్దానం నిలుపుకోవటంలో కూడా అంత కష్టం ఉంది. అందేవరకూ కాళ్లూ, అందిన తర్వాత జుట్టూ పట్టుకునే స్వభావం మంచిది కాదు.

నేటి సినిమా పరిశ్రమ, వ్యవస్ధలు, పరిస్దిలు ఎలా ఉన్నాయో ఒకసారి సింహావలోకనం చేసుకోవటం చౌదరికి, సావిత్రికి చాలా ముఖ్యం. ఇరవై వేలకి తక్కువ తీసుకుంటే తమ తాహత్తుకు లోటు కావచ్చు. నిర్మాత క్షేమం మీ క్షేమం అనీ, చిత్రం విజయమే మీ విజయమనీ, పరిశ్రమ మనుగడే మీ పురోగమనమనీ గ్రహించాలి.

లక్ష రూపాయలు తీసుకునే బెంగాల్ కోకిల కన్నాల్ బాల కాంట్రాక్టులు లేక గత సంవత్సరంలో ఐదు వేల రూపాయిలిచ్చే నిర్మాత ఉన్నాడా అని అలమటించింది. ఆర్టిస్టుగా సావిత్రికి ఇంకా ఎంతో అనుభవం రావాలి. ఒక్కోసారి రేటు ఇరవై వేలకి పెంచి, నిర్మాతని ఆర్దిక సమస్యల్లో పెట్టి ఉభయులూ దెబ్బ తినటం కన్నా, ఇద్దరికీ కష్టం లేని సామాన్య ప్రతిఫలంతో క్రమంగా ముందుకు రావటం మంచిది కానీ, ఒక్కసారి మీదకు ఎగిరి క్రిదకి పడి పోవటం అటు పరిశ్రమకూ ఇటు ఆర్టిస్ట్ కు క్షేమం కాదు.

నూతనంగా తారాపధానికి వచ్చే తారలంతా పై అంశాలని గమనించాలి. పరిశ్రమలో కాలు పెట్టినప్పుడు పడిన కష్టాలని విస్మరించి, పరిశ్రమకే 'డిక్టేటర్లు' గా మారి కూర్చోకూడదు.

(ఈ ఆర్టికల్ 1952లో 'రాత్రించరుని డైరీ' పేరట వచ్చిన 'రూపవాణి' పత్రికలో ప్రచురింపబడినది యధాతధంగా ..అక్షరం మార్చకుండా మీ ముందర ఉంచాము. అప్పట్లో రూపవాణి పత్రిక మంచి పేరున్న పత్రికే. ఆ పత్రికలో తమ గురించి రాస్తే చాలు, తమ ఫొటో పడితే చాలు అని అప్పటి నటీ,నటులు ఉవ్విళ్ళూరేవారని చెప్పుతూంటారు సీనియర్ సినిమాజనం.)

గమనిక:

ఈ పాత ఆర్టికల్ ఇప్పడు మళ్లీ పబ్లిష్ చేయటంలో ఉద్దేశ్యం.. మా పాఠకులు....స్వర్ణయుగంగా వెలిగిన ఆ రోజుల్లో సినిమా పరిశ్రమలో పరిస్దితులు ఎలా ఉండేవి. నటీనటులు, మీడియా ఎలా ఉండేవి అనే విషయాలును ఇలాంటి ఆర్టికల్స్ ద్వారా తెలుసుకోవటానికి మాత్రమే. అంతేకాని అప్పటివారిని చిన్నబుచ్చటానికో లేక పొగడటానికో చేసే ప్రయత్నం కాదిది.