Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

MCA Movie Review

December 21, 2017
Sri Venkateswara Creations
Nani, Sai Pallavi, Bhumika, Aamani, Naresh and Vijay
Mamidala Tirupati and Srikanth Vissa
Ramanjaneyulu
Diwakar Mani
Sriram Venu
Devi Sri Prasad
Dil Raju
Sriram Venu

నాని ‘ఎం.సి.ఎ’ రివ్యూ

మిడిల్ డ్రాపురా అబ్బాయి (నాని ‘ఎం.సి.ఎ’ రివ్యూ)

మధ్యలో కాస్తంత కామెడీ కావిడ దింపేసి ఖర్చైపోయినా.... "భలే భలే మొగాడివోయ్" నుంచి మళ్లీ పాత దార్లోకి వచ్చిన నాని...సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం జనాల్లో బాగా పెరిగిపోయింది. ఆ నమ్మకం గురించి నమ్మకంగా తెలుసుకుని, దాన్ని మూఢ నమ్మకం కాకుండా కాపాడుకుంటూ,నమ్మకమైన వినోదాన్ని ఇస్తూ... తనదైన శైలిలో నటించేస్తూ, నిన్ను కోరి వంటి సీరియస్ సినిమాల్లో కూడా కామెడీ తాళింపు వేసి హిట్ కొట్టేసాడు. అయితే హిట్స్ తో పాటుగా నాని ..రొటీన్ గా తనను తానే అనుకరిస్తున్నాడనే అపఫ్రధ కూడా కంటిన్యూ అయ్యిపోయింది.

అది నిజంగా నిజమైన అపప్రధనే లేక అసూయపరులు పుట్టించిన పులిహార ప్రసాదమా అనే రీసెర్చ్ వర్క్ ని కాస్సేపు ప్రక్కన పెడితే.. నాని తాజాగా నటించిన చిత్రం ‘ఎం.సి.ఎ’ ఈ రోజు విడుదలయ్యింది. రీసెంట్ గా ఫిదా అంటూ పలకరించిన సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన సినిమా కావటం, దిల్ రాజు నిర్మాత కావటంతో ఫస్ట్ లుక్, టీజర్ రిలీజైన నాటి నుంచే సినిమాపై అంచనాలు వచ్చాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా, అందుకుంటే ఏ మాత్రం ఎత్తులో అందుకుంది...నానికు ఈ సినిమా ప్లస్ అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

చిత్రం కథేమిటంటే..

నాని మంచోడే కానీ...కాస్తంత ఆ వయస్సులో ఉండే అందరి కుర్రాళ్లలాగే భాధ్యతలు,బరువులు పెద్దగా గిట్టక బేవార్స్ గా(మరీ కాదు కొద్దిగానే) తిరగటానికి అలవాటు పడి ఉంటాడు. ఆ తిరుగుళ్లకు అన్న సంపాదనపై ఆధారపడి... మందు,విందు(మూడోది లేదు) తో కులాసాగా కాలక్షేపం చేస్తూంటాడు. అన్నగారు సరదామనిషే కాబట్టి..తమ్ముడు సరదాలకు కంపెనీ ఇస్తూ సహకరిస్తూ..ఎంకరేజ్ చేస్తూ తను ఎంజాయ్ చేస్తూంటాడు.

కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఓ రోజు అన్నగారు పెళ్లిచేసుకున్నాడు. పెళ్లితో అన్నగారి పరిస్దితిలో పెద్దగా మార్పేమీ రాలేదు కానీ మన నాని పొజీషన్ లో మాత్రం ఫుల్ ఛేంజ్ వచ్చేసింది. ఆర్టీవో జాబ్ చేస్తున్న వదిన జ్యోతి(భూమిక) కాస్తంత కరుకు మనిషే. కుదురు తక్కువైన మన కుర్రాడు పని పట్టాలనుకుంది...దారిలో పెట్టాలనుకుంది. దాంతో అన్ని విధాలా కోతలు పెట్టేసింది..పనులు చెప్పటం మొదలెట్టేసింది. దానికి తోడు అన్నగారు సైతం ..మునపటిలా అడగ్గానే అడిగినంత డబ్బు చేతిలో పెట్టడం మానేసాడు. వంద చేతిలో పెట్టి...ఉద్దరింపుగా చూస్తున్నాడు. మందు,విందుకు కంపెనీకు రావటం లేదు. వదినగారు వచ్చి భలే ఫిటింగ్ పెట్టిందిరా దేముడా... ఏం చేయాలి అని ఒంటరిగా నాని తలపట్టుకున్న సమయంలో ...అతనికి మరో గడ్డు సమస్య వచ్చి పడింది...వదినగారు ట్రాన్సఫర్ రూపంలో.

వదినకు ట్రాన్సఫర్ అయ్యింది..తనకు తిరిగి వసంతం వచ్చేసింది..చెడ్డ రోజులు పోయాయని ఆనందపడేలోగా..అన్నగారు (రాజీవ్ కనకాల) ..నోట్ల రద్దు లాంటి ఊహించని బాంబు వదిలారు. నేను డిల్లీకు జాబ్ ట్రైనింగ్ కు వెళ్తున్నా ... వదినకు తోడుగా వరంగల్ వెళ్లమన్నాడు తమ్ముడుని. తప్పనిసరి పరిస్దితుల్లో ఏడుపు దిగమింగుకుంటూ.. వరంగల్ వెళ్లిన అతనికి వదినగారు ఇంటి(వంటంటి)పనులు కూడా చెప్తూండటం చూసి గోలెత్తిపోతాడు. ఏమీ చేయలేక... ఆమెపై కోపం రెట్టింపు చేసేసుకుంటాడు. మింగలేక కక్కలేక అన్నట్లుగా కొన్ని రోజులు కాలక్షేపం చేసినా ఓ రోజు బాగా విసిగిపోయి పెట్టేబేడా సర్దుకుని బిచాణం ఎత్తేద్దామని ఫిక్స్ అయిపోతాడు.

కానీ అతనికి ఇంకా వరంగల్ ఉండాలని రాసి పెట్టి ఉన్నదాయే... బిచాణా ఎత్తేస్తున్న సమయంలో అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకునే పల్లవి (సాయి పల్లవి)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలుగుతుంది. దాంతో పల్లవి కోసం మళ్లీ తన వదిన గారు పెట్టే కష్టాలను ఇష్టాలగా భరించాలని వెనక్కి వస్తాడు. అయితే ఇక్కడ మరో సినిమాటెక్ ట్విస్ట్ . పల్లవి మరెవరో కాదు...తన వదిన చెల్లెలే. కొద్ది రోజులుకి నాని ప్రేమ విషయం తెలిసిన వదిన తన చెల్లి.... పల్లవిని దూరంగా పంపిచేస్తుంది. ఈ సారి నానికు కోపం నశాళానికి అంటుతుంది. వదిన ఇంటిని ఈ సారి పూర్తిగా వదిలేసి వెళ్లపోవటానికి మళ్లీ ముహూర్తం పెట్టుకుంటాడు.

కానీ అతనికి వరంగల్ లో ఇంకొన్ని రోజులు ఉండాలని రాసి పెట్టి ఉందనుకున్నాం కదా. సరిగ్గా అదే సమయంలో వరగంల్ లో ఉండే ట్రాన్సపోర్ట్ మాఫియా శివ (విజయ్) వల్ల ఆర్టివో అయిన తన వదినకు ప్రమాదం ముంచుకొస్తోందని తెలుసుకుంటాడు. ఆ ప్రమాదం కూడా..ప్రాణాపాయం స్దాయిలో . అప్పుడు నానిలో మిడిల్ క్లాస్ మ్యాన్ బయిటకు వచ్చి ఓ నిర్ణయం తీసుకున్నాడు...ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటి... వెనక్కి వచ్చి వదినను సేవ్ చేసాడా...అసలు ఆ ట్రాన్సపోర్ట్ మాఫియా ఎందుకుని భూమికపై పగ పట్టింది.... అసలేం జరిగింది..వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎలా ఉందంటే...

బరువు, భాధ్యతలంటే ఇష్టపడని ఓ కుర్రాడు(అదీ ఇంట్లో ఆఖరివాడు)...పూర్తి కుటుంబం లేదా ఆ కుటుంబం లో ఓ వ్యక్తి(అన్న లేక వదిన లేక తండ్రి) అపదలో పడగానే ఆ పూర్తి భారాన్ని తనపై వేసుకుని గెలిపించటమనే మహత్తర కార్యక్రమం చేస్తూంటాడు. ఇది కొత్తగా కనుక్కున్న స్క్రీన్ ప్లే ఫార్ములా కాదు... సినిమా పుట్టిన నాటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్లు తీస్తూనే ఉన్నారు.

గ్యాంగ్ లీడర్, తమ్ముడు,రేసు గుర్రం వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఈ స్క్రీన్ ప్లేలో వచ్చి గెలిచాయి. ఈ సినిమా కూడా పూర్తిగా అదే స్కీమ్ ఫాలో అయ్యింది. అయితే ఎన్నో సార్లు చూసేసిన రొట్టకొట్టుడు ఫార్ములాని అంతే రొట్టకొట్టుడుగా చెప్పటంతో పెద్దగా ఆసక్తి కలిగించలేదు.

అలాగే ఈ కథకు ఎమోషన్ సీన్స్ బాగా పండాల్సిన అవసరం ఉంది. కథలో కీ క్యారక్టర్స్ అయిన వదిన మరిదిల మధ్య ఎమోషన్ ఈ కథకు బలం. అయితే అవి ఫెరఫెక్ట్ గా కథలో కలవకపోవటంతో సినిమాకు కలిసిరాలేదు... అలాగే సాయి పల్లవి పాత్ర రాను రాను..సినిమాలో గెస్ట్ గా పాటలకు వచ్చే వెళ్లిపోయేలా వెళ్ళి పోవడం, సెకండాఫ్ లో పూర్తిగా ఫన్ మిస్ అవ్వడం.. ఇవన్నీ ఇబ్బంది పెట్టాయి. అలాగే కథలో చెప్పుకోదగ్గ కొత్త మలుపులు లేకపోవడం, క్లైమాక్స్ కూడా రొటీన్‌గా సాగింది.

బద్దకంగా ...

ఫస్టాఫ్ ..సరదా..సరదాగా, రొమాన్స్,కామెడీతో గడిచిపోయినా, సెకండాఫ్ మొత్తం హీరో,విలన్ గేమ్ లా తయారైంది. హీరోని ఇరికిద్దామని విలన్..విలన్ ని మట్టుపెడదామని హీరో ...వేసే ఎత్తుకు పై ఎత్తులతో నడిచింది. అయితే ఆ ఎత్తులు..పై ఎత్తులు..అద్బుతంగా ఉంటే మనం చిత్తై పోయి..చిత్తరువులమైపోయి అలా చూస్తూండిపోదుము. కానీ ఆ సీన్స్ ఎలా ఉన్నాయంటే... శీతాకాలంలో ఉదయం దుప్పటి తీసి నిద్రలేవటంలో ఉన్నంత బద్దకం ఆ సీన్లలో కనిపించింది.ఏదో ఫ్యామిలీ సినిమా చూసి ఇంటికి పోదాం అని ప్యామిలలతో వచ్చిన వారికి ఈ విలనీలు గట్రా కొద్దిగా ఇబ్బంది కరమే.

ఇంటర్వెల్ దాకా విలన్ కు, హీరోకు మధ్య సీన్ మొదలు కాదు. అంటే ఇంటర్వెల్ దాకా మొదట మలపే రాలేదు,కథలోకి రాలేదు అనుకుంటే... ఇంటర్వెల్ అవగానే సెకండాఫ్ లో వచ్చే కథేంటి అనేది అక్కడే ఆ సీన్ లోనే పూర్తిగా రివీల్ అయ్యిపోయి గ్రాఫ్ పడిపోయింది. దీంతో మిగతా సినిమాపై పెద్దగా ఆసక్తి కానీ, చూస్తున్నంతసేపు థ్రిల్ కానీ కలగలేదు.

ఏ మాటకామాటే...

అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఇంట్రవెల్ బ్యాంగ్ లో నానిలోని మాస్ హీరో బయిటకు వచ్చి ఫైట్ చేసి విశ్వరూపం చూపాడు. అయితే ఆ మాస్ , మసాలా ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ లో మసైపోయింది. నాని, సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు ఏమీలేదు. సాయిపల్లవి ని పెట్టుకున్నందుకు దిల్ రాజుకు గిట్టుబాటు అయినట్లే..(అయితే ఫిధా అంత కాదు), నాని దగ్గర లవ్‌ ప్రపోజ్‌ చేసే సీన్‌తో పాటు, నానిని ,అతని ఇంట్లోనే ఉండి టీజ్‌ చేసే సీన్‌ ఇలా అన్నింటా నటనతో తనదైన ముద్ర వేసింది సాయిపల్లవి. కొత్తగా విలన్ గా పరిచయమైన విజయ్ అనే కుర్రాడు మాత్రం అదరకొట్టాడని చెప్పచ్చు. డైలాగులు బాగున్నాయి.

ఇక సీనియర్‌ నరేష్‌, ఆమని, రాజీవ్‌ కనకాల, నాని స్నేహితులుగా నటించిన ప్రియదర్శి, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

మ్యూజిక్ ఇచ్చింది దేవియేనా

సినిమాలో పాటలుకు సరైన ప్లేస్ మెంటే లేదు. కథే నత్త నడక నడుస్తోంది అంటే..ఈ పాటలైతే ఎక్కడికక్కడ అడ్డుతగలటం జరిగింది. అవునూ ఈ సినిమాకు సంగీతం అందించింది.. దేవిశ్రీప్రసాద్ యేనే అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే .... సినిమా పూర్తయ్యాక ఒక్కటంటే ఒక్క పాట కూడా గుర్తుకురాదు. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతంత మాత్రమే.

ప్రవీణ్ పూడి ఎడిటింగ్ జస్ట్ ఓకే. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా పాటల చిత్రీకరణలో బ్యూటీ కనబడింది. దిల్ రాజు నిర్మాణ విలువలు ఎందుకనో తగ్గాయనిపించింది. చుట్టేసిన ఫీలింగ్ కొన్నీ సీన్స్ లో కనపించింది. అది దర్శకుడు ప్రతిభా లేక నిజంగానే అలా జరిగిందో.

ఫైనల్ ధాట్

నాని హీరోగా చేసిన సినిమా అని తప్ప ఈ సినిమాలో వేరే స్పెషాలిటీ ఏమీ లేదు. కేవలం నాని కోసమే ఈ సినిమాకు వెళ్లాలనుకునేవాళ్లకు ఇది ఓ ఆప్షన్ అంతే . అలాగే టైటిల్ చూసి మధ్యతరగతి వాళ్లు ఎగబడి చూసేటంత మధ్యతరగతి భావోద్వేగాలు,సన్నివేశాలు ఏమీ లేవు...విలువలు అంతకన్నా లేవు. అన్నీ సినిమాటిక్ విన్యాసాలే.