Movies | Music | Masti Close Aha Ad
Watch Latest Movies & Web Series on AHA!
Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Ajith's Vivekam Movie Review

August 24, 2017
Vansadhara Creations
Ajith, Kajal Aggarwal, Vivek Oberoi, Akshara Haasan, Aarav Chowdhary, Karunakaran
Siva and Kabilan Vairamuthu
Vetri
Ruben
Anirudh Ravichander
TG Thyagarajan
Siva

గూఢచారి నెంబర్ 000 ('వివేకం' సినిమా రివ్యూ )

"లోపలకి వెళ్లండి..హోం మినిస్టర్ మీ కోసం కాచుకుని ఉన్నారు" అన్నాడు హోం సెక్రటరీ. లోపలకి వెళ్లగానే...

"మిస్టర్ యుగంధర్...మన దేశ క్షేమం కాపాడే భారం మీమీద పెడుతున్నాను. మరొక ప్రపంచ యుద్దం రాకుండా ఆపే భాధ్యత మీమీద ఉంది. ఒక ఘోరమైన పొరపాటు జరిగింది. మీరిప్పుడు మీ శక్తి సామర్ధ్యాలు పూర్తిగా వినియోగించి దేశాన్ని రక్షించాలి, మీరు కనుక ఈ పని చెయ్యలేకపోతే దేశంలో మరెవరూ లేరు" అన్నాడు హో మంత్రి ఉద్రేకంగా... యుగంధర్ తలూపి డిటేల్స్ తెలుసుకున్నాడు

మరోసారి...

" భగవాన్ జీ...రష్యా, అమెరికా దేశాలు వారు అంతరిక్షంలోకి పంపిన స్పుట్నిక్ లు అంతరార్దం అయ్యాయి. అది చంద్రమండలం ఉన్నవారి పనేనని అందరికీ అనుమానం. దాంతో సాహసం, సమయస్ఫూర్తి ,మేధాశక్తి గల ఒకరిద్దరు వ్యక్తులని రాకెట్లో చంద్రమండలానికి పంపి ఈ సమస్య ని పరిష్కరించాలనుకుంటున్నాం. అన్ని దేశాల్లోనూ అంతటి సమర్దులు కోసం వెతికితే అందరూ మీ పేరే ప్రపోజ్ చేసారు. మీరు వెంటనే బయిలుదేరాలి.మీకు రాకెట్ రెడీ చేసాం" అన్నాడు హో మంత్రి ఉద్రేకంగా...

ఇలా సాగుతూండేవి అప్పటి డిటిక్టివ్ నవల్స్. మన దేశాన్ని విదేశీయుల కుట్ర నుంచి రక్షించటం, చంద్రమండలం మీద సమస్యలు వస్తే రాకెట్ వేసుకుని వెళ్లి పరిష్కరించటం, రష్యాకి, అమెరికాకు మధ్య విభేధాలు వస్తే మధ్యవర్తిత్వం చేసి ప్రపంచ ప్రళయం నుంచి కాపాడటం అప్పటి డిటిక్టివ్స్ బాధ్యత. వాళ్లే జేమ్స్ బాండ్ లు, స్పై లు,మన సూపర్ స్టార్ కృష్ణగార్లు. అవి ఆ కాలంలో..మరి ఈ కాలంలో అజిత్ కుమార్ లాంటి వాళ్ళు. అప్పటి నవలను ఒకటి దుమ్ము దులిపి, కాస్త స్టైలిష్ గా తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది..అంటే అచ్చం...వివేకం సినిమాలా ఉంటుంది. సరే..సరే...ఇంతకీ ఏమిటా కథ, సినిమా జనాలకు ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు నచ్చుతుందా... అనే కదా మీరు అడగబోయేది. ఈ విషయాలు క్రింద రివ్యూలో చూద్దాం.

అరవ జేమ్స్ బాండ్ అసలు కత ఇదీ..

కౌంటర్ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పనిచేసే ఏకే( అజిత్ కుమార్)..జేమ్స్ బాండ్ కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివినవాడే. ప్రపంచంలో టెర్రరిజంతో ఏ సమస్య వచ్చినా తన టీమ్ తో వెళ్లి చీల్చి చెండాడేస్తూంటాడు. ఈ క్రమంలో అతనికి ఓ టాస్క్ అప్పచెప్తుంది అతను పనిచేసే ఏజన్సీ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన న్యూక్లియర్ వెపన్స్ ను పేల్చడానికి కావాల్సిన కోడ్ ను కలిగి ఉన్న హ్యాకర్ నటాషాను పట్టుకోమంటుంది. ఆ కోడ్ సాయింతో ప్రపంచ వ్యాప్తంగా కృతిమ భూకంపాలను సృష్టించి భారీ ప్రాణ ఆస్తి నష్టాలను సృష్టించేందుకు అంతర్జాతీయ తీవ్రవాదులు ప్లాన్ చేస్తారు. దాన్ని ఆపటానికి ఏకే రంగంలోకి దిగుతాడు. ఆ మిషన్ ఎలా ముగించి ప్రపంచాన్ని కాపాడాడు...ఇంతకీ అసలు విలన్ ఎవరు...ఇందులో తన కుటుంబాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్దితి వస్తే ఏం చేసాడు వంటి విషయాలన్నిటికి సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

మేకింగ్..హాలీవుడ్ , మ్యాటర్ ...భోజపురి

‘జేమ్స్‌ బాండ్‌’ మరీ పాతబడిపోయాడు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. జేమ్స్‌ బాండ్‌ సినిమాల్లో వింత వింత ఆయుధాలు, పరికరాలు చూపించేవారు. ఇప్పుడు మన చేతుల్లో ఉన్న సెల్‌ఫోనే జేమ్స్‌ బాండ్‌లా పనిచేస్తోంది. అందుకే అంతకు మించి ఆలోచించాల్సివస్తోంది అంటూ ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ రీసెంట్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన చెప్పింది నిజమే..ప్రపంచ సినిమాని తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ లో చూసేస్తున్న ప్రేక్షకుడు చేత అద్బుతం అనిపించాలంటే...కేవలం మేకింగ్ మీదే దృష్టిపెడితే చాలదు...దానికి తోడు కథ, కథనం కూడా హాలీవుడ్ స్దాయిలోనే ఉండాలి. స్క్రీన్ ప్లేని అదే స్దాయిలో నడపగలగాలి. అదే ఈ సినిమాలో మిస్సైంది.

ఇక...మామూలుగానే జేమ్స్ బాండ్ సినిమాలు ఓవర్ కే ఓవర్ గా ఉంటూంటాయి. దానికి అతికే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అరవ డైరక్టర్ తోడు అయితే ఇక చెప్పేదేముంది. అదే వివేకం లో జరిగింది. ప్రతీ సీన్ హీరో ఇంట్రడక్షన్ సీన్ లా డిజైన్ చేసారు. కాన్సెప్ట్ ఏమిటో, కాంప్లిక్ట్ ఏమిటో , తెరపై ఏం జరుగుతోందో అర్దమయ్యో లోగా ఇంటర్వెల్ వచ్చేస్తోంది. ఓహో...ఇదా కథ అని డైజస్ట్ అయ్యోలోగా సినిమా క్లైమాక్స్ అయ్యిపోయి ఎండ్ టైటిల్స్ పడిపోతాయి.

మైండ్ గేమ్ కాదు..వీడియో గేమ్

ఈ సినిమాలో విలన్ కు, హీరోకు మధ్య వచ్చే మైండ్ గేమ్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ చూస్తూంటే చాలాసార్లు మన మైండ్ తో డైరక్టర్ గేమ్ ఆడుతున్నాడనే డౌట్ వస్తుంది. సినిమా ఓ వీడియో గేమ్ లా అనిపిస్తుంది.

తలనొప్పే...

దర్శకుడు శివ..స్వతహాగా సినిమాటోగ్రాఫర్ అవటంతో ఆ విభాగంనుంచి అద్బుతమైన అవుట్ ఫుట్ రాబట్టారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో అయితే సూపర్బ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుంది. మన కళ్లకి శ్రమపెడుతుంది. ఏ ఫ్రేమ్ కూడా పూర్తిగా రిజిస్టర్ కానివ్వడు. కథలో ఉండాల్సిన స్పీడుని ఎడిటింగ్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే తలనొప్పి తెప్పిస్తుంది. డైలాగ్స్ జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. దర్శకుడుగా శివకు మంచి విజన్ ఉంది కానీ అందుకు తగ్గ కథ,కథనం ని ఎంచుకోలేకపోయారనిపిస్తుంది. నటీనటుల్లో అజిత్ , విలన్ గా చేసిన వివేక్ ఒబరాయ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. మిగతా వాళ్లగురించి మాట్లాడుకోవటానికీ ఏమీ లేదు.

ఫైనల్ థాట్

హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమాలు ఓ సీరిస్. ఏడాదికో రెండేళ్లకో రిలీజ్ అయ్యే ఆ సినిమా కోసం ఎదురుచూడాలి. కానీ మన లక్ ఏమిటంటే...మన దగ్గర రిలీజయ్యే ప్రతీ పెద్ద హీరో సినిమా జేమ్స్ బాండ్ సినిమానే. స్పై థ్రిల్లరే. టీ కొట్టుదగ్గర ఐదు రూపాయలకు అరువుపెట్టే.. లో మిడిల్ క్లాస్ హీరో ..తన ప్రియురాలికో, తన కుటుంబానికో(దేశానికి కాదు) ....సమస్య వచ్చినప్పుడు దుబాయి వెళ్లిపోయి...అక్కడ అంతర్జాతీయ డాన్ ని మూడు చెరువులు నీళ్లు తాగించేస్తూంటాడు. ఇంకా అవసరం అనుకుంటే హెలీకాప్టర్ లో వాళ్లింట్లో లాండ్ అయ్యిపోయి, మారు వేషం వేసేసి వాళ్ల డెన్ లో సెటిలై...వాళ్ల కూతురుని లైన్ లో పెట్టేసి..నానా రచ్చ చేస్తూంటాడు. వీళ్ల ముందు ఏ జేమ్స్ బాండ్ పనికొస్తాడు.

టీవాలానే దేశానికి ప్రధాని అయినప్పుడు టీ డబ్బులకు అప్పు వెతుక్కునేవాడు...ఇంటర్నేషనల్ మాఫియాని ఎదుర్కోలేడా, అంతర్జాతీయ టెర్రరిజాన్ని మట్టుపెట్టలేడా అని ప్రశ్నిస్తూంటాడు. హీరోయిన్స్ ఎక్సపోజింగ్ గురించి అయితే బాండ్ గర్ల్స్ ఎందుకు పనికొస్తారు. అలాంటి సినిమాలు ఎన్నో చూసిన మనకు,జేమ్స్ బాండ్ సినిమాలు బలాదూర్. స్పై థ్రిల్లర్స్ ..సో కాల్డ్ కామెడీలు. ఇలా మన దేశ ప్రేక్షకుడు అన్ని విధాలుగా మెచ్యూరిటీ లెవిన్స్ పెరిగిపోయిన పరిస్దితుల్లో పాతకాలం జేమ్స్ బాండ్ ని గుర్తు చేస్తూ సినిమా వస్తే ఆదరిస్తారా... అంటే కష్టమే అనిపిస్తుంది.

ఏమి బాగుంది: యాక్షన్ సీక్వెన్స్

ఏం బాగోలేదు: నేటివిటి లేకపోవటం. ఇంగ్లీష్‌వాళ్లూ తెలుగు మాట్లాడటం. చాలా సీన్స్ లో ,పాటల్లో కూడా సబ్‌టైటిల్స్‌ వేయటం

ఎప్పుడు విసుగెత్తింది : సెకండాఫ్ లో విలన్ కు, హీరో గా మధ్య జరిగే మైండ్ గేమ్ అతిగా మారినప్పుడు

చూడచ్చా ?: యాక్షన్ సీక్వెన్స్ కు కానీ, అజిత్ కు కానీ వీరాభిమానులైతే...