Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT


SIT, Drugs and Cinema

మీడియా రచ్చ సమర్పించు: సిట్ ...డ్రగ్స్...కొంతమంది సినిమావాళ్లు

"విసుగెత్తిన అధికారులు పూరి డ్రగ్స్‌ను వినియోగిస్తున్నప్పుడు పక్కనే సుబ్బరాజు కూర్చొని ఉన్న వీడియోలను చూపించారు. దాంతో ఆయన నోరు విప్పారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను థాయిలాండ్ నుంచి పెద్ద మొత్తంలో నగరానికి తెప్పించి సినీ పరిశ్రమను మత్తులో ముంచుతున్న విషయాన్ని సుబ్బరాజు ధ్రువీకరించినట్టు సమాచారం.."

"పొరపాటున ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నానేమోగానీ.. ప్రస్తుతమైతే తీసుకోవడం లేదని సినీ హీరో తరుణ్ సిట్ ముందు అంగీకరించారు..."

"పూరీ జగన్నాథ్ స్వయంగా డ్రగ్స్ వాడటమేకాకుండా హీరోయిన్‌ ఛార్మితో పాటు కొందరు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేవారని, ఈవెంట్లకు వచ్చేవారికి, ప్రముఖులను మచ్చిక చేసుకునేందుకు గుడ్‌విల్ కోసమే ఆయన డ్రగ్స్ అందించేవారని శ్యాం చెప్పారని సమాచారం...."

పైన మీరు చదివినవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే. అవి చదవుతూంటే..మీడియా ని ఎదురుగా కూర్చబెట్టి...ఇంటరాగేషన్ జరిగినట్లు ఇంకా చెప్పాలంటే లైవ్ టెలీకాస్ట్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది కదూ. అంత స్పష్టంగా ...అంత క్లారిటీగా ఈ వార్తలు ఉంటున్నాయి.

అయితే ఈ వార్తలను ఫాలో అవుతున్నవాళ్లకు ఓ డౌట్ ఖచ్చితంగా వస్తుంది....విచారణకు హాజరైన వాళ్లు ...ఫలానా విషయం ఇంటరాగేషన్ లో చెప్పారు...సిట్ వాళ్లు ఫలానా ప్రశ్నలు ...ఫలానా టైమ్ లో ఈ ప్రశ్నలు అడిగారు అని మీడియాకు లైవ్ అప్ డేట్స్ ఎలా తెలుస్తున్నాయి. అదేమీ అటెండర్ పోస్ట్ కు ఇంటర్వూ కాదు కదా...ప్రతిష్టాత్మక సంస్ద ...సిట్ నిర్వహిస్తున్న ఇంటరాగేషన్ కదా...అంటే సిట్ లో కూడా మీడియా వాళ్లు స్ట్రింగ్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్నారా లేక సిట్ ఆఫీసులో మీడియావాళ్లు సిసి కెమెరాలు పెట్టారా..ఇవన్నీ కాకుండా సిట్ అధికారుల్లో తమ మనష్యులని ఇంప్లాంట్ చేసేసారా ఎప్పటికైనా న్యూస్ కోసం పనికివస్తుందని..లేక సిట్ కు చెందిన వాళ్లే లీక్ లు ఇస్తున్నారా..ఇవన్నీ మిలియన్ డాలర్ క్వచ్చిన్సే.

ఎందుకంటే సిట్ విచారణలో పాల్గొన్నవాళ్లు ఎవరూ తమని ఫలానా ప్రశ్నలు ..అడిగారు..మేము ఫలానా వ్యక్తులు గురించి నిజాలు చెప్పాం అని బయిటకు చెప్పరు ..చెప్పి...తమ తోటి వారితో ...తాము ఉంటున్న ఇండస్ట్రీతో కోరి తగువు పెట్టుకోరు.

పోనీ మీడియావాళ్లు ఇలా సెలబ్రెటీలు మీద నోటికొచ్చినట్లు కల్పించి రాసేస్తే...తర్వాత ఎవరైనా వీటిని చూపించి పరువు నష్టం దావాకు వెళ్లవచ్చు లేదా...లేదా వేరే రకమైన సమస్యలు ఎదురుకావచ్చు. ఆ విషయం మీడియా సంస్దల యజమానులకు తెలియవా..సర్లే ముందు సర్కులేషన్ , టీఆర్పిలు పెరిగితే చాలనుకుంటున్నారా.

అయితే బయిట నడిచే టాపిక్ ఏమిటీ అంటే... సిట్ కు చెందిన వాళ్లే మీడియాకు లీకులు ఇస్తున్నారని... నిజంగా సిట్ వాళ్లే లీక్ లు ఇస్తున్నారంటే...ఖచ్చితంగా ఆ లీకు లు వెనక ఓ ప్రయోజనం ఆశించే ఉంటుందనేది నిజం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీడియాకు ఫేవర్ చేసి ప్రత్యేకంగా సిట్ పాముకునేదేమి లేదు. ఏదైనా ఇన్విస్టిగేట్ చేసి శోధించి సాధించే సిట్ కు..తమ ఆఫీస్ లో లీక్ లు ఇచ్చేవాళ్లు ఎవరో తెలియకపోరు...కాబట్టి నిజంగా లీక్ లు ఇస్తే అది పై స్దాయిలో తెలిసే లీక్ లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.

ఆ లీక్ లు సిట్ నుంచే వచ్చి ఉంటే...మీడియా కల్పనలు కాకుండా ఉంటే ఓ విషయం మాత్రం అర్దమవుతుంది. అదేమిటంటే...సిట్ కావాలని ఇలాంటి వార్తలు లీక్ చేసి...ఎక్కడో ఏదో డొంక (లింక్) కదుపుతోంది అన్నమాట. మీడియా ద్వారా తాము అనుకున్న విషయం చేరవల్సిన వారికి చేరాలన్న ఆలోచన కావచ్చు. అదీ ఈ కేసు ఇన్విస్టిగేషన్ లో భాగం కావచ్చు. అదే నిజమైతే ఈ టాపిక్ ఓవర్ అన్నమాట...అంతా లోక కళ్యాణార్దమే అనుకోవచ్చు హ్యాపీగా.

ఈ లీక్ ల రామాయణాన్ని ప్రక్కన పెడితే... పూరి జగన్నాథ్ సిట్ విచారణ పూర్తయ్యాక...బయిటకు వచ్చి అత్త తిట్టినందుకు కాదు..తోటి కోడలు నవ్వినందుకు అన్న చందాన.... సిట్ వాళ్లు తనను ప్రశ్నించినందుకు కాదు...దాన్ని మీడియావాళ్లు హైలెట్ చేసినందుకు అన్నట్లుగా మీడియాని నేను ఎంతో బాగా ప్రేమించాను..వాళ్లే ద్రోహం చేసారు..నన్ను..నా కుటుంబాన్ని రోడ్డున పెట్టారన్న రీతిలో వీడియో చేసి వదిలారు. ఆయన మీడియావాళ్లతో ఎంత స్నేహంగా ఉన్నారు, ఆయన సినిమాల్లో మీడియాకు ఎంత విలువ ఇచ్చారు...ఎంత గౌరవం చూపించారు వంటి విషయాలను ప్రక్కన పెడితే మీడియా ఈ విషయంలో అత్యుత్సాహం చూపిస్తోంది అనేది నిజం...అయితే ఈ ఒక్క విషయంలోనే మీడియా కొత్తగా అత్యుత్సాహం చూపిస్తోందా..అనేది కూడా ఆలోచించాలి..ఈ ఒక్క విషయంలోనే మీడియా ఇలా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే.

సినీ నటి జీవిత సైతం ఇదే విషయాన్ని చెప్తూ సినిమావాళ్లనే టార్గెట్ చేసారంటూ మీడియాకు ఎక్కారు. గోపిచంద్ వంటి హీరోలు, దిల్ రాజు వంటి ఇండస్ట్రీ పెద్దలు కొంచెం అటూ ఇటూగా ఇదే భావం వెల్లబుచ్చారు. దాంతో అయ్యో....సినిమావాళ్లను డ్రగ్ కేసులో కావాలని ఇరికించేసి, మీడియాలో హైలెట్ చేసేస్తున్నారే అని సంఘీభావం, సానుభూతి కురవటం మొదలైంది. డ్రగ్ కేసులో ఇరుక్కున్న మిగతా వాళ్లను కూడా ఇలాగే అందరికీ తెలిసేలా ఇంటరాగేట్ చేయాలన్న వారి ఆలోచన అయితే దాని కోసం డిమాండ్ చేయచ్చు. అయితే సినిమావాళ్లను ప్రత్యేకంగా డ్రగ్ కేసులో ఇరికించి సిట్ సాధించేదేమిటి...మీడియాకు అయితే టీఆర్పీలు వస్తాయి కానీ.

అసలు ఆధారాలు అంటూ లేకుండా సిట్ వంటి సంస్ద ఎందుకు సెలబ్రెటీలు జోలికి వెళ్తుంది...వాళ్లకు తెలియదా..రేపు ఏమీ ప్రూవ్ కాకపోతే తమ సంస్ద అభాసు పాలు అవుతుందని ఆలోచించరా. ఏదో సెలబ్రెటీలను ఇంటరాగేట్ చేసామని క్రేజ్ క్రియేట్ చేసుకోవటానికో, వాళ్లతో మాట్లాడాలని సరదా పడటానికో ఇంటరాగేట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు సైతం కనపడటం విచారకరం.

ఇంకా కొందరు ముందుకు వెళ్లి...తమ వెబ్ సైట్ లలో ... సినీ పరిశ్రమను దెబ్బ తీసేందుకే ఇలా మత్తు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటుందనే విమర్శలు చేస్తున్నారు. ఫలితంగా సినీ పరిశ్రమ వైజాగ్ కు తరలిపోయేలా పొగ పెడుతున్నారనే వాదన తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణకు చెందిన వారే ఇక్కడ ఉండాలని..మిగతాప్రాంతాల వారి పై ఆరోపణలు వస్తే కేసులు పెట్టి లోపల పెట్టాలని ఆదేశాలు ఉన్నాయంటూ రాసేస్తున్నారు. పరిస్దితి ఇదిగో పులి..అంటే అదిగో తోక అనే దానికన్నా దారుణంగా మారింది. లేకపోతే ఆదాయం,గ్లామర్ తెచ్చిపెట్టే సినీ పరిశ్రమను పొగబెట్టి..తమ రాష్ట్రం నుంచి ఎవరైనా తరమాలనికుంటారా...అనుకున్నా అది సాధ్యమా...ఆలోచించండి.