Movies | Music | Music

Ragalahari
ADVERTISEMENT

Raju Gari Gadhi 2 Review

October 13, 2017
PVP Cinema, Matinee Entertainments and OAK Entertainments Pvt. Ltd
Nagarjuna, Samantha, Naresh, Seerat Kapoor, Vennela Kishore, Praveen, Ashwin Babu, Avinash, kajal Aggarwal and Shakalaka Shankar
AS Prakash
Diwakaran
Abburi Ravi
Ranjith Sankar
Ohmkar
SS Thaman
Prasad V Potluri
Ohmkar

అద్గదీ ... (‘రాజుగారి గది-2’ రివ్యూ)

ఓ సూపర్ హిట్ సినిమాకు సెకండ్ పార్ట్ వస్తోందంటే ...ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకోవటానికి నిర్మాతలు వేసిన మాస్టర్ స్కెచ్ తప్ప...మరొకటి కాదు అని తెలుగు సినిమా మహారాజ పోషకులు ఎప్పుడో తీర్మానం చేసేసి, ఆ సినిమాలకు ఆమడ దూరంగా ఉండిపోతున్నారు. అయితే ఆ మధ్యన బాహుబలి 2 కి మాత్రం కట్టప్ప చేసిన మర్డర్ పుణ్యమా అని మినహాయింపు ఇచ్చారు. ఇదిగో ఇప్పుడు కూడా నాగార్జున ని, సమంత ని చూసి పార్ట్ 2 అన్నా ...ఫరవాలేదులే ధైర్యం చేద్దాం అని థియోటర్స్ కు తరలి వచ్చారు. మరి దర్శకుడు ఓంకార్...వారి ధైర్యానికి తగ్గ ప్రతిఫలంలా మంచి సినిమా ఇచ్చాడా...ఇలాంటి హర్రర్ బేసెడ్ సబ్జెక్టులో నటించటానికి నాగ్ ని ఉత్సాహపరిచిన ఎలిమెంట్స్ ఏమిటి... పెద్ద బ్యానర్ అనా లేక హిట్ సినిమా సీక్వెల్ అనా...నిజంగానే కథలో అంత దమ్ముందా....అలాగే రాజుగారి గది 2 టైటిల్ టైటిల్ ని బిజినెస్ కోసం పెట్టారా...కథతో జస్టిఫై చేసారా...నిర్మాతలు చెప్తున్నట్లుగా మూడో పార్ట్ తీసేంత హిట్ ఈ సినిమా అవుతుందా...వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథ ఏంటి...

రిసార్ట్ వ్యాపారం అంటే చెప్పుకోవటానికి రిచ్ గానూ ఉంటుంది...డబ్బుకు డబ్బు, మజాకి మజా అని నమ్మారో ఏమో కానీ... క్లోజ్ ఫ్రెండ్స్... అశ్విన్ (అశ్విన్ బాబు), కిశోర్ (వెన్నెల కిశోర్), ప్రవీణ్ (ప్రవీణ్) కలిసి రిసార్ట్ ని రన్ చేస్తూంటారు. అయితే వీళ్లు ఎప్పుడూ ఆడ వాసన..ఆడవాసన అని కామ పిశాచుల్లా కలవరిస్తూంటారు. ఏమన్నా వర్కువుట్ అవుతుందేమో అని ప్రయత్నాలు చేస్తూంటారు(కాకపోతే కమిడయన్స్ కదా అంతకు మించి ముందుకు వెళ్లే సీన్ ఉండదు కదా ). ఆ క్రమంలో ఆ రిసార్ట్ కు వచ్చిన వాళ్లపై ఓ రెండు కళ్లూ వేసి ఆనందపడుతూ, చెయ్యేసే అవకాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు వీళ్లకు ఓ రోజు అనుకోని ట్విస్ట్ పడుతుంది.

ఓ రోజు తమ సరససల్లాపు పోగ్రాంలో ఉండగా...తమ రిసార్ట్ లో ఓ దెయ్యం ఉందని తెలుస్తుంది. దెయ్యం అంటే భయం అనే విషయం ప్రక్కన పెడితే...దెయ్యం..తమ రిసార్ట్ లో ఉందనే విషయం ఏ టీవీ నైన్ లోనో బ్రేకింగ్ న్యూస్ గా వచ్చేస్తే...ఇక రిసార్ట్ కు జనం ఎవరూ రారని,(వస్తే గిస్తే దెయ్యాలపై రీసెర్చ్ చేసేవారు....అక్కడున్న దెయ్యాలని చూడ్డానికి పరదేశ దెయ్యాలు రావాలి) అలా జరిగితే... బిజినెస్ క్లోజ్ చేసుకుని రోడ్డుపై పడాలని అర్దం చేసుకుంటారు. దాంతో కంగారుపుట్టి..దెయ్యాలను తమ రిసార్ట్ నుంచి వదిలించటం కోసం మెంటలిస్ట్ రుద్ర(నాగార్జున)ని కాంటాక్ట్ అవుతారు. కళ్లలోకి చూస్తూ మనసులో ఏముందో చెప్పగల సమర్థుడు రుద్ర. పోలీసులు కూడా పలు కేసుల్లో ఆయన సహకారం తీసుకుంటారు.

చంద్రముఖిలో రజనీకాంత్ లా రుద్ర...ఆ రిసార్ట్ కు వచ్చి...అక్కడున్నది రెగ్యులర్ గా హర్రర్ సినిమాల్లో రేప్ కి గురి అయ్యి అక్కడక్కడే తిరుగుతూండే దెయ్యం కాదని .... ఓ అమ్మాయి ఆత్మ(సమంత) అని తేలుస్తాడు. తన శక్తితో ఆ ఆత్మతో లైవ్ లో ముఖాముఖి పోగ్రాం పెడదామని ప్రయత్నిస్తాడు. కానీ ఆ ఆత్మ...కాస్తంత పెంకి దెయ్యం లక్షణాలు కలిగినది..అంత త్వరగా చెప్పిన మాట వినదు..ముఖ్యంగా దెయ్యం సినిమాలు బాగా చూసిందో ఏమో కానీ...తలుపులు హఠాత్తుగా వేసేయటం, గాజు గ్లాసులు గాల్లోకి లేపి బ్రద్దలుకొట్టడం, టీవీలో ఏదో పోగ్రామ్ చూస్తూంటే...డిస్ట్రబ్ చేసి అక్కడ కనపడటం, సెల్ ఫోన్ లో కాల్ గా వెళ్లి మాట్లాడి భయపెట్టడం వంటి దెయ్యం వేషాలు వేస్తూంటుంది.(ఖాళీగా ఉండే ఆత్మలకు, దెయ్యాలకీ ఏమీ తోచదేమో).

కానీ కొద్ది సేపటికి మన మెంటలిస్ట్ చెప్పిన మాటలకు కన్వీన్స్ అయ్యి తన పేరు , ఫొటో, తన గురించి కొన్ని క్లూస్ ఇస్తుంది. ఇవి చాలు నాకు...నీ ఫ్లాష్ బ్యాక్ లాగటానికి..అని రుద్ర రంగంలోకి దిగి ఆ ఆత్మ గురించిన ఎంక్వైరీ మొదలెడతాడు...ఆ క్రమంలో అతనికి సమంత వంటి అంత అందమైన అమ్మాయి ఆత్మ హత్య చేసుకుని ..ఆత్మగా మారటానికి గల కారణాలు.. .ప్రపంచంలో వేరే ఏ గొప్ప ప్లేసూ లేనట్లు.....ఈ యావరేజ్ రిసార్ట్ నే అంటిపెట్టుకోవటానికి గల కారణం, వంటి సంగతులు తెలుసుకుంటాడు. అంతేకాకుండా ఆ ఆత్మకు ప్రతీకారంతో రగిలిపోతోందని తెలుసుకుని , దాన్ని చల్లాల్చటానికి ఏర్పాట్లు చేస్తాడు. ఫైనల్ గా ఆ ఆత్మ ..ఆ రిసార్ట్ ని వదిలి వెళ్లేలా ఒప్పిస్తాడు..ఇంతకీ ఆమె ప్లాష్ బ్యాక్ ఏమిటి, అసలేం జరిగింది, ఆమె ప్రతీకారానికి కారణం ఏమిటి...ఎవరిపై పగ తీర్చుకోవాలనకుంటోంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

హర్రర్ కామెడీ మాత్రం కాదు...

నిజానికి ఈ సినిమా ఫస్టాఫ్ లో కాస్తంత హర్రర్, కామెడీ ఉన్న మాట నిజమే కానీ ఇది హర్రర్ కామెడీ మాత్రం కాదు... హర్రర్ విత్ ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా కథ ..దెయ్యం సినిమా కథలకు భిన్నమైనది. దెయ్యం కథ వింటే జాలి పుట్టేలా ఉంటుంది. అలాగే పనిలో పనిగా ..ప్రస్తుతం సొసైటీలో పెద్ద సమస్యగా మారిన ఓ బర్నింగ్ టాపిక్ ని ఎత్తుకుని దానిపై చర్చించటం చేసారు. అదే సినిమాకు హైలెట్ గా నిలిచింది.

కథలోనే కాదు.. కథకీ ఆత్మ ఉంది..

ఇక ఈ సినిమా లో సమంత కనిపించేది కొద్ది సేపే అయినా ఆమె చుట్టూ కథ తిరగటంతో ఆమే హైలెట్ అవుతూ వస్తుంది. ఆమె చేసింది ఆత్మ పాత్ర అయినా దానికీ ఓ అంతరాత్మ ఉండటం, భావోద్వేగాలతో కూడిన ప్లాష్ బ్యాక్ సినిమాకు హైలెట్ అయ్యాయి. దెయ్యం సినిమాల్లో చాలా వాటికి ఇలాంటి ఎమోషనల్ గతం ఉండదు. కట్టె..కొట్టే..తెచ్చే అన్నట్లుగా ముగిస్తూంటారు. అదే ఇక్కడ చేయకపోవటమే సినిమాకు ప్లస్ అయ్యింది.

తెలుగులో పూర్తిగా కొత్త

నాగార్జున చేసిన మెంటలిస్ట్ పాత్ర ఇప్పటి వరకూ తెలుగులో ఏ హీరో చేయనది. దాంతో చాలా కొత్తగా అనిపించింది. అందులోనూ ఆత్మను బలవంతంగా వెళ్లగొట్టటమో లేక మరొకటో చేయకుండా..ఆ ఆత్మపై జాలి చూపెడుతూ..దానికి సాయంగా నిలచే పాత్రలో నాగార్జున జీవించారు. సమంత, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు...సినిమాని మరో స్దాయికి తీసుకువెళ్లాయి. సాధారణైమన కంటెంట్ కూడా అసాధారణంగా మారిపోయింది. ఇవే పాత్రలు వేరే వాళ్లు చేస్తే ఈ స్దాయి లో అప్లాజ్ వచ్చేది కాదేమో.. నాగ్, సామ్ లకు ఉన్న ఇమేజ్ అలాంటిది.

ఇంతకీ ఆ గది ఎక్కడుంది అన్నయ్యా...

ఓంకారన్నయ్య... సినిమాకూ టైటిల్ కు సంభందం ఉండాల్సిన పనిలేదేని ఫిక్స్ అయ్యనట్లున్నారు. ఎక్కడా రాజు గారి గది అనే ప్రస్దావనకే రాదు. సినిమా చూసి బయిటకు వచ్చాక..అరే ..ఇంతకీ రాజుగారి గది ..ఏంటి...అదెక్కడ ఉంది ...అని జనం మాట్లాడుకోవాల్సిన పరిస్దితి వచ్చింది.

తమ్ముడుని వదిలేసినా..

దర్శకుడుగా ఓంకార్ ...టెక్నికల్ గా చాలా బాగా సినిమాని డిజైన్ చేసారనే చెప్పాలి. అలాగే తమ తమ్ముడు అశ్విన్ బాబుని సినిమాలో తీసుకున్నాం కదా..అతనికి కీలకమైన పాత్ర ఇవ్వాలి వంటివి పెట్టుకోకుండా...కథని కథలాగే తీసాడు.

వీళ్ళంతా కూడా...

ఈ సినిమా ప్లస్ పాయింట్స్ లో రచయిత అబ్బూరి రవి మాటలు, సంగీత దర్శకుడు థమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , దివాకరన్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే అంత గొప్పగా లేవు...జస్ట్ ఓకే అన్నట్లుగా ఉన్నాయి. ఇక ఎడిటర్ గారు మరింత పెద్ద మనస్సు చేసుకుని ఫస్టాఫ్ లో బోర్ కొట్టే కామెడీని తీసేసి ఉంటే ఉంకా బాగుండేది. అయితే ఎక్కడా బోర్ కొట్టలేదు. మంచి సినిమా చూసిన ఫీలింగే కలిగించారు టెక్నీషియన్స్...నటీనటులు.

ఫైనల్ థాట్

ఇంకాస్త హర్రర్ ని, కామెడీని కూడా ఈ కథలో మిక్స్ చేసి ఉంటే ఖచ్చితంగా 'రాజుగారి గది' స్దాయిలో ఉండేది. ఇప్పుడు ఓ ఎమోషనల్ థ్రిల్లర్ చూసినట్లే ఉంది ..అంతే.

ఏమి బాగుంది: ఇంటర్వెల్, క్లైమాక్స్

ఏం బాగోలేదు: ఫస్టాఫ్ లో తప్పదు రా బాబు..కామెడీతో ఫిల్ చేయాలి అన్నట్లుగా రాసిన సీన్స్

ఎప్పుడు విసుగెత్తింది : ఇంటర్వెల్ దగ్గర దాకా సినిమా లో కీ రోల్స్ అయిన సమంత, నాగ్ రాకపోవటం

చూడచ్చా ?: రొటీన్ దెయ్యాలతో విసుగెత్తిన వారికి ఇది మంచి ఆప్షనే.