Jawaan Movie Review - Cast: Sai Dharam Tej, Mehreen Kaur Pirzada
Movies | Music | Music

ADVERTISEMENT

Jawaan Movie Review

December 1, 2017
Arunachal Creations
Sai Dharam Tej, Mehreen Kaur Pirzada, Prasanna, Jaya Prakash and Eeswari Rao
Cameraman: KV Guhan
Art: Brahma Kadali
Editing: SR Sekhar
Co-Writers: Kalyan Varma Dandu, Sai Krishna and Vamsi Balapanuri
Story-Screenplay-Dialogues: BVS Ravi
SS Thaman
Krishna
BVS Ravi
Surya Prakash Josyula

'జవాన్' మూవీ రివ్యూ

'ధ్రువ' పూనెన్... ( 'జవాన్' మూవీ రివ్యూ)

అనగనగా ఓ వయస్సు మళ్లిన సైంటిస్ట్...జారిపోతున్న కళ్లజోడుని సర్దుకుంటూ...తెల్ల జుట్టుని సవరించుకుంటూ...రాత్రింబవళ్లూ కష్టపడి.. ఓ ఫార్ములా కనుక్కుంటాడు. ఆ ఫార్ములా... నిత్య యవ్వనం తెచ్చి పెట్టేది కావచ్చు.. లేక ప్రపంచాన్ని నాశనం చేసే మిస్సైల్ అవ్వచ్చు, అవన్నీ కాకపోతే ఓ గొప్ప మెడిసన్ ఫార్ములానో కావచ్చు.(ఒక్కోసారి...బయిటప్రపంచంతో సంభందం లేకపోవటంతో ఏ కరెంటో, బల్బో, ల్యాప్ టాపో కూడా కనుక్కోవచ్చు). అయితే ఆ మ్యాటర్ ఎంత గోప్యంగా ఉంచినా... విలన్స్ కు లీక్ అవుతుంది. (ఎందుకంటే వాళ్లు చాలా అప్ డేట్ గా ఉంటారు. సైన్స్ జర్నల్స్ గట్రా ఫాలో అవుతూండవచ్చు) దాంతో ఆ ఫార్ములాని దొంగిలించి (తన సొంతానికి వాడుకోవాలనుకోడు..స్వార్దపరుడు కాడు) వేరే దేశానికి అమ్మేసి సొమ్ము చేసుకోవాలనకుని ప్లాన్ చేస్తాడు. ఆ ప్రాసెస్ లో ఆ సైంటిస్ట్ ని కిడ్నాప్ చేయటం, ఆ ఫార్ములాని దొంగిలించేయటం గట్రా చేస్తాడు. అప్పుడు జేమ్స్ బాండ్ లాంటి హీరో రంగంలోకి దిగి...ఆ అంతర్జాతీయ నేరస్దులకు సాయపడే విలన్స్ ని పట్టుకుని దేశభక్తి డైలాగులతో కడిగేసి, పోలీస్ లకు పట్టించేసి, సైంటిస్ట్ ని , ఫార్ములాని వెనక్కి తెచ్చేసి దేశాన్ని రక్షించేసి అందరి చేతా శభాష్ అనిపించుకుంటాడు. ఇదీ ...ఎన్నో సినిమాల్లో మనం చూసిన పాత కథ. ఎన్నో కామిక్స్ లో చదివిన రొటీన్ కథ.

కాలం మారింది..ప్రేక్షకులు మారారు. మరి కాన్సెప్టులు...వాటిలో మాత్రం మార్పు లేదు. అవే కాస్తంత అడ్వాన్సెడ్ టెక్నాలజీ అనే ముసుగు వేసుకుని మళ్లీ మళ్లీ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఓ సౌలభ్యం ఉంది. పాత సినిమాలు చూడని కొత్త ప్రేక్షకులు వీటిని ఆదరిస్తూంటారు. ఏడేళ్లకొకసారి సినీ ప్రేక్షకులు మారతారనే థీరి ప్రకారం వర్కవుట్ అవుతూంటాయి. కానీ దానికో చిన్న గమనిక ఉంది. అది.. కాన్సెప్టు పాతదయినా కథ చెప్పే విధానం ఇంట్రస్టింగ్ గా ఉంటే..సినిమాలు హిట్ అవుతున్నాయి..లేదంటే... వచ్చిన దారే...వేగంగా చూసుకుంటున్నాయి. ఈ జవాన్ సినిమా కూడా కొంచెం అటూ ఇటూలో అదే పాత ఫార్ములా స్కీమ్ కథే. అయితే దానికి కాస్తంత దేశభక్తిని జోడించి, గ్యాంగ్ లీడర్ లాంటి ఫ్యామిలీలో సెటప్ లో ఈ కథను సెట్ చేసారు. ఇప్పుడున్న జనరేషన్ ఈ కథ ఎంతవరకూ నచ్చి వర్కవుట్ అవుతుంది. మైండ్ గేమ్ అంటూ చెప్పబడుతున్న సీన్స్ ఎంతవరకూ ఎక్కి సినిమాని గట్టెక్కిస్తాయి. ప్లాఫ్ ల్లో ఉన్న హీరో సాయిని ఈ సినిమా ఒడ్డున పడేస్తుందా...వంటి విషయాలు తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే.

మిస్సైల్ కోసం మైండ్ గేమ్ (కథేంటి)

భాథ్యతగల పౌరుడు..జై (సాయి ధరమ్ తేజ) తెలివైన వాడు కూడా. ఇంట్లో చిన్న కొడుకు అయిన అతనికి గ్యాంగ్ లీడర్ లో చిరంజీవిలా తన కుటుంబం అంటే ప్రాణం. ఆర్.ఎస్.ఎస్ లో జాయిన్ అయ్యి...దేశ భక్తితో పెరిగి పెద్దైన జై... డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్ మెంట్ ( డిఆర్డీవో) లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలోనే డిఆర్డీవో శాస్త్రవేత్తలు ఆక్టోపస్ అనే ఒక శక్తివంతమైన మిస్సైల్ సిస్టంను కనిపెడతారు. దానిపై ఇంటర్నేషనల్ మాఫియా కన్ను పడుతుంది. దాన్ని సొంతం చేసుకోవాలనకోవటం కోసం లోకల్ విలన్ కేశవ్ (ప్రసన్న)కు ఆ పని అప్పచెప్తారు. 500 కోట్ల డీల్ కావటంతో .. ఎలాగైనా ఆక్టోపస్ ని పొందాలనుకుంటాడు.

ఈ విషయం తెలుస్తుంది జై కు. ఆ డీల్ కాకుండా అడ్డం పడటం మొదలెడతాడు. దాంతో రెచ్చిపోయిన కేశవ్.. స్వయంగా రంగంలోకి దిగి..జై ఫ్యామిలీని టార్గెట్ చేసి...ఆ మిస్సైల్ ని పొందాలని స్కెచ్ వేస్తాడు. అక్కడ నుంచి జై కు, కేశవ్ కు మధ్య ప్రత్యక్ష్య వార్ మొదలవుతుంది. వార్ లో భాగంగా ..కేశవ్ ప్రమాదకరమైన మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. అందుకు జై ఎలా రెస్పాండ్ అవుతాడు. కేశవ్ పై మైండ్ గేమ్ లో గెలిచి దేశాన్ని ఎలా రక్షిస్తాడు, తన కుటంబాన్ని ఎలా కాపాడుకుంటాడు.....ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సెటప్ సూపర్..పాత్రే పాసివ్

విలన్..హీరో..మధ్యలో వీళ్లద్దరి మెయిన్ టార్గెట్ అక్టోపస్ ...ఇలా సెటప్ వరకూ ఫెరఫెక్ట్ గానే ఉంది. కానీ కథలో హీరో పాత్ర పాసివ్ యాక్టివ్ పాత్ర అయిపోవటమే దెబ్బ కొట్టింది. ఎంతసేపూ విలన్ చేసే చర్యలకు హీరో ప్రతిస్పందిస్తూంటాడే కానీ ..ఎత్తుకు పై ఎత్తు వేసి విలన్ ని ఆడించడు. దాంతో కథనం చాలా డల్ గా సాగుతుంది. క్లైమాక్స్ దాకా అలాగే సాగుతుంది. అప్పటిదాకా దాకా వార్ వన్ సైడ్ గా కనిపిస్తుంది. విలన్ బారి నుంచి తన కుటుంబాన్ని, దేశాన్ని కాపాడేందుకు హీరో పరుగెడుతూ,పోరాడుతూ ఆయాసపడుతూంటాడు. విలన్ కూల్ గా తన పని తాను చేసుకుపోతూంటాడు. గమనిస్తే హీరో... తెరపై విలన్ ని ఎదుర్కోవటానికి .. నిరంతంరం ఏదో చేస్తున్నట్లు ఉంటాడు..కానీ నిజానికి ఏమీ చేయలేడు..చేయడు. దాంతో మైండ్ గేమ్ గా కనిపించినా హీరో క్యారక్టర్ ఏమీ చేయని పూర్తి పాసివ్ అయిపోయి..విసుగు అనిపిస్తుంది. అసలు ఫలానా వాడు విలన్ అని హీరోకు తెలియటానికే సినిమా ముప్పావు భాగం పట్టింది. అదేదో ఇంటర్వెల్ కే హీరోకు,విలన్ కి మధ్య ప్రత్యక్ష్య యుద్దం మొదలైతే ఖచ్చితంగా ఇంట్రస్టింగ్ గా ఉండేది.

కన్ఫూజ్ కొంతుంది కానీ కేకే

వినటానికి చాలా ఎక్సైటింగ్ గా అనిపించే ఈ కాన్సెప్ట్ ని దర్శకుడు సరిగ్గా డీల్ చేయలేకపోయారనిపిస్తుంది. ఓ ప్రక్కన సినిమాని మాస్ మసాలా వ్యవహారంగా తీర్చిదిద్దాలనే తాపత్రయం,మరొక ప్రక్క స్టైలిష్ గా చూపిస్తూ.. ఇంటిలిజెంట్ గా మైండ్ గేమ్ ని నడపాలనే ఆలోచన ... దర్శకుడుని కన్ఫూజ్ చేసాయనిపిస్తుంది. ఫస్టాఫ్ ..పూర్తిగా ప్రెడిక్టిబుల్ గా నడిచింది..రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేసాడు. సెంకడాఫ్ లో కథలోకి వచ్చాడు కానీ కలిసిరాలేదు. దర్శకుడుగదా కన్నా..బి.వియస్ రవి..డైలాగు రైటర్ గా విజృంభించాడు. చాలా చోట్ల విజిల్స్ కొట్టించే దేశభక్తి డైలాగులు చెప్పించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో హీరో తన కుటుంబంలోని ఫైయిల్యూర్స్, సక్సెస్ ల గురించి మాట్లాడే మనసుకు హత్తుకున్నాయి. కానీ క్లైమాక్స్ కు వచ్చేసరికి పూర్తిగా గ్రిప్ వదిలేసాడు. పరమ రొటీన్ గా ముగించాడు.

హీరోగా సాయి మాత్రం...

అయితే సాయి ధరమ్ తేజ మాత్రం ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించాడు. ప్రతి సినిమాలో చూపించే అతి ఉత్సాహం (హైపర్ యాక్షన్ )ఇందులో పూర్తిగా వదిలేసాడు. అలాగే కథ బలం ఉన్న సబ్జెక్టు ల వైపుకు సాయి మొగ్గు చూపటం ప్రారంభించాడు అనిపించింది. ఇది మంచి పరిణామం. కేవలం తన యాంటిక్స్ పై కాకుండా కథలపై ఆధారపడితే నిలబడే సినిమాలు వస్తాయి. అలాగే డాన్స్ లలో తన మామయ్యలను గుర్తు చేస్తూ..స్టెప్స్ వేయటం బాగుంది.

'ధ్రువ'పూనాడా

అనుకుని చేసారో ..అనుకోకండా జరిగిందో కానీ ..ఈ సినిమా చూస్తున్న ప్రతీ ఒక్కరికీ ..'ధ్రువ' (రామ్ చరణ్) గుర్తుకు రావటం విచిత్రం. అందుకు అరవింద్ స్వామి పాత్రను అనుకరించే విలన్ పాత్ర కారణం కావచ్చు. లేదా మైండ్ గైమ్ లు కారణం కావచ్చు.

టెక్నికల్ గా ...

థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా.., పాటల మాత్రం కిక్ ఇవ్వలేదు. ఎస్.ఆర్ శేఖర్ ఎడిటింగ్ రేసిగా కాన్సెప్టుకు తగినట్లుగా ఉంది. కెవి. గుహన్ సినిమాటోగ్రఫీ బాగుంది కానీ ఎందుకనో ..నెట్ ఎఫెక్ట్ లో తీసిన ఫైట్ మాత్రం సరిగ్గా రాలేదు. నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. డైరక్టర్ గా రవి...అద్బుతమని చెప్పలేంకానీ స్రిప్టు సరిగ్గా సెట్ చేసుకుని ఉంటే కమర్షియల్ హిట్ కొట్టే స్కిల్స్ మాత్రం ఉన్నాయనించింది.

స్పెషల్ మెన్షన్..

హీరో అన్నయ్యగా ఫుల్ లెంగ్త్ క్యారక్టర్ చేసిన శశిధర్ కోసూరి..చాలా సీన్స్ లో మంచి ఎక్సప్రెసివ్ గా కనిపించారు. అయితే యంగ్ విలన్ పాత్రలు వేసుకోవాల్సిన వయస్సులో ..అన్నయ్య పాత్రలకు వెళ్లిపోవటమే ఆశ్చర్యం.

ఫైనల్ థాట్

జవాన్ టైటిల్ చూసి..ఇదేదో పూర్తి దేశభక్తితో నడుస్తూ, యుద్దభూమిలో ఉండే జవాన్లకు సంభందించిన త్యాగపూరిత కథ తో తయారైన సినిమా అనుకుని దూరంగా ఉండేవాళ్లు ఆ భయం పెట్టుకోవాల్సిన పనిలేదు. ఇది పక్కా కమర్షియల్ సినిమానే. పాటలు, ఫైట్స్ ఉన్నాయి..బ్రహ్మానందం లేడు అంతే.

 Other Links:   Movie Info   Galleries   Functions   Preview  
 
  
ADVERTISEMENT